ఈసీ లెక్కలు : డబ్బు సీజ్‌లో దేశంలోనే ఏపీ టాప్

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 06:44 AM IST
ఈసీ లెక్కలు : డబ్బు సీజ్‌లో దేశంలోనే ఏపీ టాప్

Updated On : March 28, 2019 / 6:44 AM IST

ఢిల్లీ : ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతుంటుంది. మనీ కట్టల పాములు బూజు దులుపుకుని వెలుగులోకొస్తాయి. ఓటర్లను మద్యం, మనీలతో ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే క్రమంలో కట్టల కొద్దీ నగదు బైటపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో నగదును సీజ్ చేయటంలో ఏపీలోనే అత్యధికంగా జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.  ఈక్రమంలో దేశంలోనే అత్యధికంగా డబ్బు స్వాధీనం చేసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఈసీ వెల్లడించింది. 
 

దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మొత్తం రూ.613 కోట్లను స్వాధీనం చేసుకున్నామని గురువారం (మార్చి 28)న  కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కలు వెల్లడించింది. 

రూ.104 కోట్ల అక్రమ మద్యం స్వాధీనం
దేశంలో మార్చి 27వతేదీ నాటికి రూ.104 కోట్ల అక్రమంగా ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో మద్యంతోపాటు డ్రగ్స్ పంపిణీ కూడా పెరిగింది. రూ.145 కోట్ల విలువగల డ్రగ్స్ ను దేశంలో నార్కొటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా డబ్బు స్వాధీనం చేసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందనీ…ఎన్నికల కోడ్ అమలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఏపీలో అత్యధికంగా రూ.62 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు రూ.49 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

యూపీలో రూ.24 కోట్ల మద్యం స్వాధీనం 
యూపీలో అత్యధికంగా రూ.24 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో రూ.20కోట్లు, ఏపీలో రూ.17 కోట్ల మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. మొత్తంమీద దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ధనం, మద్యం, డ్రగ్స్ పంపిణీల ప్రభావం పెరిగిందని ఎన్నికల కమిషన్ వెల్లడించిన లెక్కలు స్పష్టంచేశాయి.