తుపాకీతో కనిపిస్తే కాల్చేస్తాం : జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెచ్చరికలు 

  • Published By: chvmurthy ,Published On : February 19, 2019 / 07:25 AM IST
తుపాకీతో కనిపిస్తే కాల్చేస్తాం : జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెచ్చరికలు 

శ్రీన‌గ‌ర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవ‌రైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్ల‌ను వెంట‌నే కాల్చి పారేస్తామని ఇండియ‌న్ ఆర్మీ మంగళవారం  హెచ్చరించింది.  కాశ్మీర్‌లో జ‌రిగిన పుల్వామా కారు బాంబు దాడి త‌ర్వాత‌ ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్ప్స్ క‌మాండ‌ర్ క‌న్వ‌ల్జిత్ సింగ్ దిల్లాన్  మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇచ్చారు. గ‌న్ ప‌ట్టుకుని తిరిగేవాళ్ల‌ను రూపుమాపేస్తామ‌ని ఆయన అన్నారు. 

పుల్వామా ఫిదాయిన్ దాడి జ‌రిగిన త‌ర్వాత వంద గంట‌ల్లోనే ఆ దాడికి కార‌ణ‌మైన జైషే ఉగ్ర‌వాదుల‌ను హ‌తమార్చామని ఆయన తెలిపారు.  ఫిబ్రవరి 14న జరిగిన కారు బాంబు దాడి ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ ఆయన చాలారోజుల తర్వాత కాశ్మీర్‌లో అలాంటి వ్యూహాన్ని  ఉగ్రవాదులు అమ‌లు చేశార‌న్నారు. ఫిదాయిన్ దాడుల‌ను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అన్ని ర‌కాలుగా సిద్ధ‌ంగా ఉన్నట్లు ఆయ‌న చెప్పారు. 

దేశ‌వ్యాప్తంగా కాశ్మీరీల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను దృష్టిలో పెట్టుకుని 14411 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు సీఆర్‌పీఎఫ్ ఆఫీస‌ర్ జుల్ఫీక‌ర్ హ‌స‌న్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో చ‌దువుతున్న కాశ్మీరీ విద్యార్థుల‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు అండ‌గా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఉగ్ర‌వాద రిక్రూట్మెంట్‌లో గ‌ణ‌నీయ‌మైన త‌రుగుద‌ల క‌నిపించింద‌ని కాశ్మీర్ ఐజీ ఎస్పీ పాణి తెలిపారు. గ‌త మూడు నెల‌ల్లో  ఉగ్రవాద సంస్ధల్లో ఎటువంటి రిక్రూట్మెంట్ జ‌ర‌గ‌లేద‌ని ఆయన తెలిపారు.

indian army warning

 

 

 

Read Also : ఎవరి ఆదేశాలో తెలుసా : పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోండి

Read Also : మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ