AI: ఏఐ.. భవిష్యత్తులో మానవ ఉనికినే ప్రమాదంలో పడేస్తుందా?

ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలు దేనికి సంకేతం? మరి దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి?

AI: ఏఐ.. భవిష్యత్తులో మానవ ఉనికినే ప్రమాదంలో పడేస్తుందా?

artificial intelligence challenges with deep fake videos

Artificial Intelligence Challenges: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచంలో పెను సంచలనాన్ని సృష్టిస్తున్న ఈ కృత్రిమ మేధ వల్ల మానవాళికి ఎంత వరకు ఉపయోగం జరుగుతుందో తెలియదు కానీ.. నష్టాలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయంటున్నారు కొందరు నిపుణులు. మనకు తెలియకుండానే మనకు సంబంధించిన మొత్తం సమాచారం లాగేసే ఈ ఏఐ.. భవిష్యత్తులో మానవ ఉనికినే ప్రమాదంలో పడేస్తుందా? తాజాగా.. దక్షిణ కొరియాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా నిలవనుందా? ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలు దేనికి సంకేతం? మరి దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి?

టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అన్ని నష్టాలూ కలుగుతున్నాయి. ఇటీవలి కాలంలో బాగా ఉపయోగంలోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మందికి తిప్పలు తెచ్చిపెడుతోంది. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి లీక్‌ కాగా.. రెండ్రోజుల వ్యధిలోనే మరో వీడియో కూడా బయటకు వచ్చింది. ఇదే సమయంలో బాలీవుడ్ కత్రినాకైఫ్, సారా టెండూల్కర్‌కు సంబంధించిన రెండు ఫేక్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాలోని ఓ ప్లాంట్‌లో మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో.. ఓ వ్యక్తిని పొట్టనబెట్టుకుంది. ఇక ఇటీవలే కేరళలో డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి 40 వేలు లూటీ చేశారు. ఏఐ సాయంతో ముఖం మార్చుకొని స్నేహితుడిలా వీడియో కాల్ చేసి డబ్బులు కాజేశారు సైబర్ నేరగాళ్లు.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కృత్రిమ మేధ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒకప్పుడు మనిషి చెప్పిన పనులు మాత్రమే చేసే.. రోబోలు ఇప్పుడు వాటంతట అవిగానే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇలాంటి రోబోలు, ఏఐతో మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి.

ఏఐతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశముంది. మనం చేసే చిన్నపాటి సెర్చ్ కూడా మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఏం ఇష్టపడతాం? వంటి చాలా విషయాలను ఇట్టే పసిగట్టేస్తోంది ఈ కృత్రిమ మేధ. మన ఫోన్స్‌లో ఉండే యాప్స్ అన్నీ ఏఐతో లింక్ కావడంతో సమాచారం మొత్తం దాని చేతుల్లోకి వెళ్లిపోతోంది.

ఇక చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరు దానిపైనే ఆధారపడటం ప్రారంభించారు. ముందుముందు ఏఐ ఆధారంగా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సైబర్‌ దాడుల కోసం ఏఐని వాడుకోవడం, ఏఐ ద్వారా టెర్రరిస్టులు దాడి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాదు.. నకిలీ వార్తలు, మోసాల వంటి తీవ్రత పెరగడంలో ఏఐ పాత్ర కీలకంగా మారే అవకాశముంది. ఇక గొంతులను అనుకరించే సామర్థ్యం కూడా ఏఐకి ఉండటం వల్ల ఆర్థిక మోసాలకు ఎంతో ఆస్కారం ఉంది.

Also Read: ఆన్‌లైన్‌లో దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఈ ఫేక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్లతో జాగ్రత్త.. సైబర్ పరిశోధకుల హెచ్చరిక!

అయితే తాజాగా తెరపైకి వచ్చిన మెషీన్ లెర్నింగ్ మరింత ప్రమాదకరంగా మారింది. ఇది తనంతట తానుగానే అన్నీ నేర్చుకుంటుంది. ఏఐతో అనుసంధానమైన రోబోలు మెషీన్ లెర్నింగ్‌లో భాగంగా ఒకదాన్ని మించి మరొకటి నేర్చుకుంటూ ఉంటాయి. దీంతో సూపర్ ఇంటెలిజెంట్‌గా మారే అవి.. మనుషులు ఇచ్చే ఆదేశాలను బేఖాతరు చేయడం మొదలు పెడతాయి. ఫలితంగా మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీనికి 10% అవకాశముందని ఇప్పటికే ఒప్పుకున్న ఏఐ పరిశోధకులు.. దానికి x-risk అని పేరు కూడా పెట్టారు.

Also Read: భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ‘డీప్‌ఫేక్‘ అలర్ట్.. ఎడిట్ చేశారో లేదో ముందే చెప్పేస్తుంది!

ఈ నేపథ్యంలోనే అమెరికా స్పేస్ ఫోర్స్ విభాగం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఛాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డేటా భద్రత సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఏఐని నియంత్రించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కూడా ఇటీవలే సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు అవసరమైన కొత్త ప్రమాణాలను సిద్ధం చేస్తారు.

Also Read: విప్రో, ఇన్ఫోనిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ.. ఇంటి దగ్గర నుంచి చేసింది చాలు.. ఇక ఆఫీసుకు రావాల్సిందే..!

ఈ తరుణంలోనే బ్రిటన్‌లో తొలి ఏఐ సేఫ్టీ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని రిషి సునాక్. ఏఐ టెక్నాలజీ వల్ల సూపర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ ఏఐ సేఫ్టీకి సంబంధించి పరిజ్ఞానాన్ని మెరుగుపర్చడంతో పాటు కొత్త కృత్రిమ మేధ సాంకేతికతలను అధ్యయనం చేస్తుంది. ఇదే సమయంలో ఏఐ వల్ల కలిగే నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేస్తుంది.