రిజర్వేషన్లు కాదు పథకాలు తేవాలి : ఒవైసీ

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 04:24 PM IST
రిజర్వేషన్లు కాదు పథకాలు తేవాలి : ఒవైసీ

హైదరాబాద్: అగ్రకుల పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తే మరికొందరు తప్పుపడుతున్నారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం తీరును తప్పుపట్టారు. పేదరికం నిర్మూలించడానికి రిజర్వేషన్లు కాదు పథకాలు తీసుకురావాలని సూచించారు. దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారని ఆయన వివరించారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చని హితవు పలికారు. కానీ రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినదని, ఆర్థిక కారణాల ఆధారంగా రాజ్యాంగం రిజర్వేషన్లను ఇవ్వలేదని ఒవైసీ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలులేదు అని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అగ్రకులాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ఈ అస్త్రం ప్రయోగించిందని విపక్షాలు ఆరోపించాయి.