ఆర్థికమాంద్యం! : ప్రొడక్షన్ నిలిపివేస్తున్న అశోక్ లేల్యాండ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2019 / 08:15 AM IST
ఆర్థికమాంద్యం! : ప్రొడక్షన్ నిలిపివేస్తున్న అశోక్ లేల్యాండ్

Updated On : September 9, 2019 / 8:15 AM IST

ఆర్థికమాంద్యం కారణంగా పలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఫ్లాంట్ లకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతోఇప్పటికే పలు సంస్థలు తమ ఫ్లాంట్ లకు తాత్కాలిక సెలవులు ఇచ్చి ప్రొడక్షన్ నిలిపివేయగా ఇప్పుడు ఆ జాబితాలో దేశీయ రెండవ అతిపెద్ద మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్ తయారీదారు అశోక్ లేల్యాండ్  చేరింది. తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతున్న కారణంగా ఈ నెలలో వివిధ ప్రాంతాల్లోని తమ ఫ్లాంట్ లలో  కొన్ని రోజులు నాన్ వర్కింగ్ డేస్(పని లేని దినాలు) గా పాటిస్తామని అశోక్ లేల్యాండ్  తెలిపింది. 

తమిళనాడులోని ఎన్నోర్ ఫ్లాంట్  16 రోజులు, హోసూర్1,2,సీపీపీఎస్ ఫ్లాంట్  5రోజులు, రాజస్థాన్ లోని అల్వాల్ ఫ్లాంట్  10రోజులు,మహారాష్ట్రలోని బాంద్రాలో 10రోజులు,ఉత్తరాఖండ్ లోని పట్నాఘర్ లోని ఫ్లాంట్ కు 18 రోజులు సెలవులు ఇస్తున్నట్లు అశోక్ లేల్యాండ్ ప్రకటించింది. మొత్తం అశోక్ లేలాండ్ వాహనాల అమ్మకాలలో  28% క్షీణించింది. గత ఏడాది జులై నెలలో 15,199 వాహనాలు అమ్ముడవగా,ఈ ఏడాది జులై లో 10,927 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి. మొత్తం దేశీయ అమ్మకాలు జులై నెలలో 10,101 యూనిట్లుగా ఉండగా, జూలై 2018 లో 14,205 యూనిట్లతో పోలిస్తే 29% తగ్గిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశీయ మార్కెట్లో మీడియం,హెవీ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు జులై నెలలో 41% తగ్గి 6,018 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది అదే నెలల 10,152 యూనిట్లు నమోదైనట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది జులై నెలలో 4,053 యూనిట్లతో పోలిస్తే 2019 జూలైలో తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు 4,083 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులపై ప్రభుత్వం పునరుద్ధరించిన ఖర్చుల నేపథ్యంలో నిర్మాణ, మైనింగ్ ట్రక్కుల డిమాండ్ తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ కతురియా చెప్పారు.