అయోధ్యకేసు మార్చి5 కి వాయిదా : మధ్యవర్తిత్వమే పరిష్కారం

ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద రామజన్మభూమి కేసులో భిన్న పార్టీల మధ్య ఏమాత్రం అవకాశం ఉన్నా మధ్యవర్తిత్వం నెరిపేందుకు కోర్టు ప్రయత్నిస్తుందని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. వివాదాస్పద భూమి పరిష్కారం కోసం తీవ్రంగా పరిశీలిస్తున్నామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. కాకపోతే ఈ కేసులోని ఇరు పక్షాలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేలా లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై మధ్యవర్తిత్వం సాధ్యమయ్యే పనికాదని, గతంలో పలుసార్లు ప్రయత్నించి విఫలమైన విషయాన్ని సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాధన్, రంజిత్ కుమార్‌లు గుర్తు చేశారు. న్యాయమూర్తులే దీనికి సరైన పరిష్కారం చూపుతూ వివాదానికి తెరదించాలని వారు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈకేసులో మధ్యవర్తిని నియమించే అంశాన్నినిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది. కేసును మార్చి 5 కి వాయిదా వేసింది.
సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ ప్రారంభం కాగానే కేసుకు సంబంధించిన సెక్రటరీ జనరల్, నలుగురు రిజిష్ట్రార్లు సంతకాలు చేసిన పత్రాలను ఆయా పార్టీల న్యాయవాదులకు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తెలిపారు. ఈకేసులో ఉభయ పక్షాలకు సమన్యాయం జరగాలన్నదే తమ అభిమతమని ధర్మాసనం పేర్కోంది. కాగా యూపీ ప్రభుత్వం సమర్పించిన అనువాద ప్రతాలను తాము పరిశీలించలేదని ముస్లిం పార్టీలతరపు న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ స్పష్టం చేశారు. డాక్యుమెంట్ల పరిశీలనకు 8 నుంచి 12 వారాల సమయం అవసరమవుతుందని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే స్పష్టం చేశారు.
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లా మధ్య సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ అయోధ్య కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటయ్యింది.