Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలుసా? పూర్తి వివరాలు..

ఇటీవలి కాలంలో అత్యంత ఖర్చుచేసిన నిర్మాణం ఇదే. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూ.2,989 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలుసా? పూర్తి వివరాలు..

Ayodhya Ram Mandir

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న వైభవంగా జరగనుంది. మొత్తం మూడు దశల్లో రామమందిరాన్ని నిర్మిస్తుండగా.. తొలి దశ పనులు పూర్తికావడంతో శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. 2025 డిసెంబరులోగా మిగతా పనులన్నీ పూర్తవుతాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది హాజరవుతారు.

రామాలయ నిర్మాణానికి మొత్తం దాదాపు రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇటీవలి కాలంలో అత్యంత ఖర్చుచేసిన నిర్మాణం ఇదే. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూ.2,989 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.836 కోట్ల అంచనా వ్యయంతో కట్టారు. అత్యధికంగా ఖర్చు చేస్తున్న రెండో కట్టడంగా అయోధ్య రామమందిరం నిలిచింది.

అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. సరయూ నదీ తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. భవ్యరామ మందిర వైభవం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఈ రామమందిరం ఒకటిగా నిలిచిపోనుంది.

దేశంలో అత్యంత ఖరీదైన మందిరాల్లో అయోధ్య రామమందిరం అగ్రభాగాన నిలిచిపోనుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సాంకేతిక సాయంతో ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థలు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాయి. రామాలయ సముదాయం 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధాన ఆలయం సుమారు 3 ఎకరాల్లో.. 161 అడుగుల ఎత్తులో ఉంది. మూడు అంతస్తులు, 12 ద్వారాలతో నిర్మిస్తున్నారు.

విరాళాలు..
రామమందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. సుమారు 3,500 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.11 లక్షలు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 5 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి మొత్తం సేకరించిన విరాళాల్లో ఇప్పటివరకు దాదాపు 52 శాతం ఖర్చయ్యింది.

మిగతా సొమ్ము రాబోయేకాలంలో ఆలయ నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు ట్రస్ట్‌ వినియోగించనుంది. ఆలయంతోపాటు అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ఈ విరాళాల నుంచి కొంతభాగం ఖర్చు చేస్తున్నారు.

ఏ కట్టడానికి ఎంత?

అయోధ్య రామమందిర నిర్మాణాన్ని 1,800 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టగా… దేశంలోని మిగతా మతపర నిర్మాణాలను పరిశీలిస్తే…

  • గుజరాత్‌లోని విశ్వ్ ఉమియా ధామ్‌ను వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించారు
  • బెంగళూరులోని కృష్ణ లీలా థీమ్‌పార్కును రూ.700 కోట్లతో..
  • పశ్చిమ బెంగాల్‌లోని వేద ప్లానిటోరియం టెంపుల్‌ రూ.622 కోట్లతో..
  • ఉత్తరప్రదేశ్‌లోని చంద్రోదయ ఆలయం రూ.500 కోట్లతో
  • బిహార్‌లోని విరాట్‌ రామాయణ టెంపుల్‌ రూ.500 కోట్లతో
  • గుజరాత్‌లో రూ.800 కోట్లతో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం
  • ఢిల్లీలో రూ.306 కోట్లతో ప్రధానమంత్రి సంగ్రహాలయ భవనం
  • రూ.176 కోట్లతో ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకచిహ్నం

రామమందిరంలో ప్రతిష్టించనున్న 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ఐదేండ్ల బాలుడి రూపంలో ఉండనుంది. మొత్తమ్మీద ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామ మందిరం రూపుదిద్దుకుంది.

Also Read:  Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం