అయోధ్య తీర్పు: ఇంటర్నెట్ కట్.. తాత్కాలిక జైళ్లు ఏర్పాటు

హిందువులు, ముస్లింల మధ్య వివాదానికి కారణమైన అయోధ్య భూమి విషయంలో ఎట్టకేలకు అంతిమ తీర్పు రాబోతుంది. 1992లో హిందువులు మసీదును కూలగొట్టడంతో చెలరేగిన అల్లర్లలో దేశవ్యాప్తంగా 2వేల మంది చనిపోయారు. దీంతో ఈ అయోధ్య భూ వ్యవహారం దేశవ్యాప్తంగా హిందూ, ముస్లీంల మనోభావాలకు ముడిపడిన సమస్యగా మారింది. ఈ క్రమంలోనే రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసు తీర్పు రానుండగా అయోధ్యలో ఇప్పటికే 20వేలఅ మంది పారామిలిటరీ దళాలను మోహరించారు.
ఈ క్రమంలోనే అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు యూపీలోని 31 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. పుకార్లు సృష్టించేవాళ్లను, రెచ్చగొట్టే వైరల్ మెసేజ్‌లు పంపేవాళ్లను వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. హింసకు ఎక్కడా తావులేకుండా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అంతేకాదు.. తాత్కాలిక జైళ్లను కూడా ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు టచ్‌లోకి వెళ్తుంది.
సోషల్ మీడియాలో 670 మందిపై ఇప్పటికే నిఘా పెట్టగా.. పుకార్లు ప్రచారం జరిగే అవకాశం ఉన్న క్రమంలో ఎవరైనా హద్దులు దాటి పోస్టింగ్ చేస్తే ఇమీడియట్‌గా అరెస్ట్ చేయాలని భావిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్‌లోని 31 జిల్లాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండడాన్ని నిషేధించింది. 144 సెక్షన్ విధించింది. అయోధ్య చుట్టూ పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరినీ చెక్ చేస్తున్నారు.