కరోనాకు ఆయుర్వేద మెడిసిన్స్ … భారత్-అమెరికా క్లినికల్ ట్రయిల్స్

చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్ ప్రస్తుతం మానవాళికి పెద్ద ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ మహమ్మారికి బలి అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడిచేసే వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి చెక్ పెట్టే మెడిసిన్ ను తయారుచేసే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.
కోవిడ్19పై ఇప్పటికే ఫార్మా కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఇప్పుడు అమెరికా- భారత్ దేశాలు.. ఆ మహమ్మారి నివారణ కోసం ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేందుకు రెడీ అయ్యాయి.
రెండు దేశాలకు చెందిన ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు సంయుక్తంగా కరోనా ట్రీట్మెంట్ కోసం ట్రయల్స్ నిర్వహించనున్నారు. వాషింగ్టన్‌లో ఉన్న భారతీయ అంబాసిడర్ తరణ్‌జిత్ సింగ్ సంధూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేసేందుకు సంయుక్తంగా పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
కోవిడ్ చికిత్స కోసం ఆయుర్వే ఔషధాన్ని తయారు చేసేందుకు రెండు దేశాల పరిశోధకులు జాయింట్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయుర్వేద రంగానికి చెందిన శాస్త్రవేత్తలు తమ జ్ఞానాన్ని, పరిశోధనా అంశాలను పంచుకున్నట్లు సంధూ తెలిపారు. తక్కువ ధర మందులను, వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారతీయ ఫార్మా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నదని, ఇప్పుడు కూడా భారతీయ కంపెనీలు మహమ్మారి నివారణలో కీలక పాత్ర పోషించనున్నట్లు సంధూ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం భారత్, అమెరికా మధ్య మూడు ప్రాజెక్టులు నడుస్తున్నట్లు తరన్‌జిత్ సింగ్ సంధూ చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్ల రెండు దేశాలకు చెందిన వారే కాకుండా బిలియన్ల మంది ప్రజలకు వ్యాక్సిన్లు ఉపకరిస్తాయన్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫాం రంగంలో.. టెలిమెడిసిన్, టెలీహెల్త్ కీలకంగా మారనున్నట్లు ఆయన తెలిపారు
రెండు దేశాలు వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్(వీఏపీ) కింద రోటోవాక్ వ్యాక్సిన్ తయారు చేసినట్లు సంధూ తెలిపారు. పిల్లల్లో డయేరియాకు కారణమైన రోటా వైరస్ నిర్మూలనలో ఆ డ్రగ్ కీలకంగా మారింది. భారత్‌బయోటెక్ సంస్థ ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిందన్నారు. వీఏపీ ప్రాజెక్టు కింద టీవీ, ఇన్‌ఫ్లూయాంజా, చికున్‌గునియా వ్యాధులకు కూడా వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నట్లు అయన చెప్పారు.