స్మశానం వద్ద బీజేపీ నేతల ఫ్లెక్సీ ప్రచారం..స్థానికుల ఆగ్రహంతో ఎమ్మెల్యే క్షమాపణలు

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

స్మశానం వద్ద బీజేపీ నేతల ఫ్లెక్సీ ప్రచారం..స్థానికుల ఆగ్రహంతో ఎమ్మెల్యే క్షమాపణలు

Bengaluru Banner Near Covid 19 Crematorium With Bjp Leaders Faces Draws Ire

Updated On : May 5, 2021 / 4:20 PM IST

Bengaluru దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ పేరుతో ప్రచారం పొందాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి తీవ్ర విమర్శల పాలైంది.

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బెంగళూరులోని గిడ్డేనహళ్లి స్మశానవాటిక వద్ద అధికారులు ఉచితంగా ఏర్పాట్లు చేశారు. దాని క్రెడిట్ కొట్టేయాలన్న ఉద్దేశంతో స్థానిక బీజేపీ నేతలు అత్యుత్సాహపడ్డారు. స్మశానానికి దగ్గర్లో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, యలహంక ఎమ్మెల్యే మరియు బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌, స్థానిక బీజేపీ నేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి, అంత్యక్రియలకు వచ్చేవారికి నీరు, కాఫీ, భోజనం ఉచితంగా ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు.

అయితే, ఈ ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు స్థానికులు బ్యానర్ కి చెప్పులు,షూల దండ తగిలించారు. ఈ ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఈ ఫ్లెక్సీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ కామెంట్స్ చేశారు. ఫ్లెక్సీల్లో మోడీతో పాటు సీఎం యడియూరప్ప నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో ‘అసలు మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.

విషయం కాస్తా పెద్దదవడంతో వెంటనే స్పందించిన యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్.. వెంటనే బ్యానర్ ను తొలగించాలని స్థానిక నేతలను ఆదేశించారు. ఈ విఫయమై ఓ వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌.. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బ్యానర్ ఏర్పాటు విషయం ముందు విషయం తనకు తెలియదని ఆయన తెలిపారు. ఆ స్మశానం చాలా మారుమూల ఏరియాలో ఉన్నందున.. స్మశానానికి అంత్యక్రియల కోసం వచ్చే వారి కోసం ఉచిత నీరు,ఇతర సౌకర్యాలు కల్పించాలని తాను అధికారులను కోరానని తెలిపారు. అయితే తనకు తెలియకుండా ఎవరో పొరపాటున ఈ బ్యానర్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ప్రధాని ఫోటో,తన ఫోటో,సీఎం మరియు ఇతరుల ఫోటోలు ఉపయోగించడం క్షమించరాని విషయని ఎమ్మెల్యే తన వీడియో సందేశంలో తెలిపారు.