పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ..భలే ఆఫర్

మా బంకుకు వచ్చి పెట్రోలు పోయించుకోండి బాబూ..వేడి వేడి బిర్యానీని గిఫ్టుగా పొందండి అంటే జనాలు వెళ్లకుండా ఉంటారా? అందులోను బిర్యానీ ప్రియులు మరీ ఎగేసుకుంటూ వెళ్లిపోతారు. పెట్రోలు పోయించుకుంటే బిర్యానీ ప్యాకెట్ ను కాంప్లిమెంటరీగా ఇస్తామంటూ ప్రకటన రావటంతో అక్కడ భారీగా వాహనాదారులు క్యూ కట్టారు. పెట్రోలు పోయించుకుని బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని వెళుతున్నారు. ఎక్కడా చెబితే మేం కూడా వెళతాం అనుకుంటున్నారా? అదే నండీ బెంగళూరులో..
బెంగళూరు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఇందిరానగర్ ఆర్టీఓకు సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సర్వీస్ స్టేషన్ ఫ్రీగా కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లను అందిస్తోంది. సోమవారం (సెప్టెంబర్ 21,2020)నుంచి తమ వినియోగదారులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల మధ్య ఈ ఫ్రీ బిర్యానీ ప్యాకెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఐఓసీ.
ఇంధన అవుట్‌లెట్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తన కష్టమర్లకు వెజ్ అండ్ నాన్‌వెజ్ (నాన్ వెజ్ తిననివారికి వెజ్ బిర్యానీ ప్యాకెట్) అందజేస్తోంది. గ్రూప్ రెస్టారెంట్ మేనకా ఫుడ్స్, ఐఓసీ సహకారంతో రూ.2,000 కన్నా ఎక్కువ ఇంధనం నింపే వారికి ఉచిత బిర్యానీ అందిస్తోంది.
మరోవైపు రూ.250 కంటే ఎక్కువ ఇంధనం నింపేవారికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తున్నారు. ఈ విషయమై నిర్వాహకుడు ప్రకాశ్‌రావు సాథే మాట్లాడుతూ.. ‘గత 51 ఏళ్లుగా ఈ ఐఓసీ స్టేషన్‌ను నిర్వహిస్తోంది. కర్ణాటకలోనే అత్యధికంగా అమ్మకాలు జరిగాయి.
ఇన్ని సంవత్సరాలుగా మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు వినియోగదారులకు కృతజ్ఞతలు ఈ విధంగా తెలుపుతున్నాం. ఈ ఆఫర్‌ను నెల పాటు కొనసాగిస్తాం. అనంతరం వివిధ ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపుతో కొనసాగించాలని యోచిస్తున్నాం’ అని ప్రకాష్‌రావు సాథే వెల్లడించారు.