కరోనా టైంలో ఆపద్బాందువుడు : ప్లాస్మా ఇచ్చి..ఆరుగురిని కాపాడాడు.

కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ప్లాస్మా అందిస్తే..ఫలితం ఉంటుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. కానీ ఓ యువకుడు ఇచ్చిన ప్లాస్మాతో కొంతమంది జీవితాలు నిలబడుతున్నాయి. ప్లాస్మా థెరపీ కరోనా బాధితులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఎయిమ్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల కునాల్ గన్న అనే యువకుడు..మూడు సార్లు ప్లాస్మా దానం చేసి, ఆరుగురు కరోనా రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడని హెల్త్ కేర్ గ్లోబల్ (హెచ్ సీజీ) వెల్లడించింది. ఆరుగురు ప్రాణాలు కాపాడటానికి కునాల్ మూడుసార్లు ప్లాస్మాను ఇచ్చాడని మరోసారి ప్లాస్మాను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని ఆసుపత్రి అసోసియేట్ డీన్ విశాల్ రావు వెల్లడించారు.
శ్రీ జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్కులర్ సైన్సెస్ కార్డియాలజిస్టు బీహెచ్ నటేశ్ కు కరోనా సోకిందన్నారు. జులై 21న నటేశ్ బన్నెర్ఘట్ట రోడ్డులోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చేరారు. ఆయనకు వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తూ, ఇతర చికిత్స అందజేసినా ఆరోగ్యం క్షీణించిందన్నారు. చివరికి ప్లాస్మా చికిత్సకు చేయాలని నిర్ణయంచి..జూలై 28న నటేశ్ ఐసీయూలో ఉన్నప్పుడు కునాల్ గన్నా దానం చేసిన ప్లాస్మాను ఎక్కించామన్నారు.
మూడు రోజుల్లో నటేశ్ కోలుకున్నారు. ఐదు రోజులు ఐసీయూలో ఉంచిన తరువాత వార్డుకు మార్చామన్నారు. ఆరోగ్యం మెరుగుపడడంతో నటేశ్‌ను బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాం’ అని తెలిపారు. వీడియో కాల్ చేసి ప్లాస్మా దానం చేసి తన ప్రాణాలను కాపాడినందకు గన్నాకు ధన్యవాదాలు తెలిపారు నటేశ్.