హోలీ సెల‌బ్రేష‌న్స్‌లో ఇలా చేయొద్దు.. ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తాం: బెంగళూరు సిటీ వాటర్ బోర్డు

Bengaluru Water Crises: బెంగళూరు నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కర్నాటక సర్కార్ తెలిపింది.

హోలీ సెల‌బ్రేష‌న్స్‌లో ఇలా చేయొద్దు.. ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తాం: బెంగళూరు సిటీ వాటర్ బోర్డు

Bengaluru Water Crises

ఐటీ నగరి బెంగళూరును నీటికష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పదిహేను రోజులుగా బెంగళూరులో నీటి తిప్పలు తీవ్రమయ్యాయి. రోజువారీ అవ‌స‌రాల‌కు కూడా జ‌నం నీరులేక‌ ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ వైపు హోలీ వేడుకలు.. మరోవైపు ఐపీఎల్ వస్తోంది. ఈ రెండు ఈవెంట్లకు పెద్దఎత్తున నీరు అవసరం. దాంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

హోలీ వేడుక‌ల‌పై బెంగ‌ళూరు వాటర్ బోర్డు పలు సూచ‌నలు చేసింది. హోలీ సెల‌బ్రేష‌న్స్‌లో నిర్వహించే పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు కావేరి, బోర్‌వెల్ నీటిని ఎట్టిప‌రిస్థితుల్లో వాడొద్దని కోరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రం ప్రతిరోజూ 75వేల‌ లీటర్లకు పైగా మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తామని చెప్పింది బెంగళూరు సిటీ వాటర్ బోర్డు.

దిద్దుబాటు చర్యలు
ఐపీఎల్ మ్యాచ్‌కు నీటి సరఫరాపై విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కర్నాటక సర్కార్. నీటికొరత కారణంగా మ్యాచ్ లు రద్దయితే పరువు పోతుందని గమనించి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు 75వేల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఆస్థాయిలో నీటిని ఐపీఎల్ మ్యాచ్‌లకే ఇస్తే ప్రజల నీటి అవసరాల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వేస్ట్‌వాటర్‌ను శుద్ధి చేసి చిన్నస్వామి స్టేడియానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్‌ పార్క్‌ వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి ఇవ్వనున్నారు.

ఈ ఏడాది వర్షాభావం, భూగర్భజలాలు తగ్గిపోవడంతో పాటు బెంగళూరులో భారీగా నిర్మాణాలు పెరగడంతో వాటర్ షార్జేజ్ ఏర్పడింది. వైట్‌ఫీల్డ్‌, కేఆర్‌పురం, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, ఆర్‌ఆర్‌నగర్‌, కేంగేరీ, సీవీ రామన్‌ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. అందుకే నీటి వినియోగంపై ఓ వైపు ఆంక్షలు విధిస్తూనే.. పొదుపు చేయాలని సూచిస్తున్నారు అధికారులు.

బెంగళూరు నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కర్నాటక సర్కార్ తెలిపింది. నీటి సంక్షోభం ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం చూపుతోంది. తాగడానికి నీళ్లు తెచ్చుకోడానికే టైం సరిపోవడంతో.. ఆఫీసులకు సెలవులు పెడుతున్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాటర్ షార్టేజ్‌తో ఐటీ కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు అయితే సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. నెలరోజుల్లోనే నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్.

AP Rain Alert : భారీ వానలు..! ఏపీకి మరోసారి వర్ష సూచన, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరిక