భీమా కోరేగావ్ కేసు..వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు

భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు జారీ చేసింది. విచారణ కోసం సెప్టెంబర్-9న ముంబైలోని తమ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది.
వరవర రావు అల్లుళ్లు కే సత్యనారాయణ ప్రస్తుతం ఇఫ్లూలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మరో అల్లుడు కేవీ కూర్మనాథ్ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో డిప్యూటీ ఎడిటర్ హోదాలో ఉన్నారు.
కాగా, భీమా కోరేగావ్ కేసులో పుణె పోలీసులు 2018 ఆగస్టులో వరవర రావును అరెస్టు చేశారు. ఆ సమయంలో ప్రొఫెసర్ కే సత్యనారాయణ నివాసాల్లో సోదాలు చేపట్టారు. అప్పట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. తాజాగా మరోసారి ఇద్దరు అల్లుళ్లకు సమన్లను జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. భీమా కోరేగావ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రొఫెసర్ కే సత్యనారాయణ ఇదివరకే వెల్లడించారు.
మరోవైపు, ప్రస్తుతం వరవర రావును ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో కరోనా వైరస్ బారినా పడ్డారు. దీనితో మూడు వారాల వరకు వరవర రావు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ జైలుకు తరలించారు.
వరవర రావును విడుదల చేయాలంటూ కొద్దిరోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో వరవర రావును విడుదల చేయాలంటూ భూమన విజ్ఙప్తి చేశారు. అంతకుముందు- బెయిల్ కోసం వరవర రావు కుటుంబ సభ్యులు ముంబై హైకోర్టునూ ఆశ్రయించారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా బెయిల్ కోసం పిటీషన్లను దాఖలు చేశారు. అయితే వారవారం రావు కు బెయిల్ లభించలేదు.