తుఫాన్ బీభత్సం : భువనేశ్వర్‌లో కూలిన10 లక్షల చెట్లు

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 07:23 AM IST
తుఫాన్ బీభత్సం : భువనేశ్వర్‌లో కూలిన10 లక్షల చెట్లు

Updated On : May 11, 2019 / 7:23 AM IST

ఒడిశాలో ఫోని తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండమైన గాలులు.. భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైంది. మే 03వ తేదీన ప్రచండమైన తుఫాన్‌కు ఇంకా తేరుకోలేదు. ఈ తుఫాన్ విలయం తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భువనేశ్వర్‌లో భారీగా వృక్షాలు నేలకూలాయి. మొత్తం 10 లక్షల చెట్లు కూకటివేళ్లతో నేలకూలాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ విరిగిపడిన చెట్లే దర్శనమిస్తున్నాయి. చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. 

ఒక్క భువనేశ్వర్ పరిసరాల్లోనే 10 లక్షల చెట్లు కూలిపోవటాన్ని ఊహించుకోలేకపోతున్నారు భువనేశ్వర్ ప్రజలు. పచ్చటి ప్రాంతం అంతా ఇప్పుడు ఎడారిగా కనిపిస్తుంది. వీధుల్లోనే కాదు.. ఇంట్లోని మొక్కలు సైతం గాలులకు ఎగిరిపోయాయి. ప్రస్తుతం భువనేశ్వర్ సిటీలో చెట్లు కనిపించే పరిస్థితి లేదు. దశాబ్దాల పాటు పెంచుకున్న చెట్లు నేలకూలడంతో భావోద్వేగానికి గురవుతున్నారు ప్రజలు. మా అమ్ముమ్మ ఎప్పుడో పెట్టిన మమిడి చెట్టు.. ప్రతి ఏటా వందల కాయలు ఇస్తుంది.. ఇప్పుడు కూలిపోయింది అంటూ షిప్రా అనే మహిళ కన్నీళ్ల పర్యంతం అయ్యింది. తుఫాన్ వల్ల మరోసారి అమ్ముమ్మను కోల్పోయాను అంటూ బాధను వ్యక్తం చేసింది. 

పడిపోయిన చెట్లను జాగ్రత్తగా తొలగిస్తున్నామని ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ మిశ్రా తెలిపారు. ఈ వర్షాకాలంలో భారీగా చెట్లు పెంచేందుకు ప్లాన్ చేసినట్లు, భువనేశ్వర్ మొదట ఎలా ఉందో అలాంటి పరిస్థితి తెచ్చేందుకు ప్రతి శాఖ కృషి చేస్తోందన్నారు. 445 శానిటేషన్ సిబ్బంది 10 వార్డుల్లో పనుల్లో నిమగ్నమై ఉండగా వివిధ ఏజెన్సీల నుండి వచ్చిన 2 వేల 306 మంది 57 వార్డుల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.