Bihar : సభలో CM అభ్యర్థి తేజస్వి యాదవ్ పై చెప్పుల దాడి

  • Published By: nagamani ,Published On : October 21, 2020 / 12:20 PM IST
Bihar : సభలో CM అభ్యర్థి తేజస్వి యాదవ్ పై చెప్పుల దాడి

Updated On : October 21, 2020 / 12:30 PM IST

Biha Elections 2020 : బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం (అక్టోబర్ 20,2020) తేజస్వి యాదవ్ ఔరంగాబాద్‌ జిల్లాలోని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.



సభా వేదికపై కూర్చున్న బీహార్ మాజీ మంత్రి తేజస్వీ యాదవ్‌పై కొందరు గుర్తు తెలియని దుండగులు చెప్పులు విసిరారు. ఆ చెప్పుల్లో ఒకటి తేజస్వి యాదవ్ తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కుతున్నాయి. తమ ప్రత్యర్థి పార్టీ, కూటముల నేతలకు చెక్ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఈ క్రమంలో తేజస్వి యాదవ్ పై చెప్పులు విసరటం సంచలనంగా మారింది. సభా వేదిక మీదకు చేరుకున్న తేజస్వీ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని అగంతకులు రెండు చెప్పులు ఆర్జేడీ నేత మీదకి విసిరారు. ఓ చెప్పు ఆయన పక్కగా దూసుకెళ్లి పడిపోగా, ఏం జరిగిందోనని తేజస్వీ యాదవ్ గమనిస్తుండగానే మరో చెప్పు ఆయనకు తాకి, ఒడిలో పడింది. ప్రత్యర్ధులే ఈ పనిచేయించారా? లేక నిరసనతో ఎవరైనా ఇలా చేశారా? అనేదానిపై విచారిస్తున్నారు.


కాగా..బీహార్ మాజీ సీఎం లల్లూ ప్రసాద్ యాదవ కొడుకుగా తేజస్వి యాదవ్ తండ్రి ఇమేజ్‌ని నమ్ముని ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల మహాకూటమి తరుపున తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఆరితేరుతున్న తేజస్వి… ఆరంభంలోనే నితీశ్ లాంటి దిగ్గజ నేతను ఢీకొడుతున్నాడు.


గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మహాకూటమి సర్కార్‌లో మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత కూటమి విచ్చిన్నమవడం,తండ్రి జైలుకెళ్లడంతో పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు.



ఈ ఎన్నికల్లో బీహార్ నిరుద్యోగ సమస్యను హైలైట్ చేస్తూ తేజస్వి యువతను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయంగా తన అనుభవం తక్కువే అయినా తండ్రి లాలూ ప్రసాద్ ఇమేజ్‌నే ఎక్కువగా నమ్ముకున్నాడు.