బిహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. అతిపెద్ద పార్టీగా బీజేపీ.. కొత్త సీఎంగా..

"పల్టీ రామ్‌"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.

బిహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. అతిపెద్ద పార్టీగా బీజేపీ.. కొత్త సీఎంగా..

Nitish Kumar

Updated On : November 14, 2025 / 11:57 AM IST

Bihar CM Candidate: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది (ఆధిక్యంలో). ఇవాళ సాయంత్రంలోపు పూర్తి ఫలితాలు వచ్చేస్తాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఎన్డీఏ ఇప్పటివరకు సీఎంగా అభ్యర్థిగా ప్రకటించలేదు. ఈ విషయంపై ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్‌ షాను పలుసార్లు మీడియా ప్రశ్నించగా ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేదు.

నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోనే తాము ఎన్నికల్లోకి వెళ్తున్నామని అమిత్‌ షా అన్నారు.. కానీ, ఆయనే మళ్లీ సీఎం అవుతారన్న విషయాన్ని ఎక్కడా ప్రకటించలేదు. ఎన్డీఏలోని ఏ అగ్రనాయకుడూ నితీశ్ మళ్లీ సీఎం అవుతారన్న మాటే అనలేదు.

ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ సారి బీజేపీ, జేడీయూకి దాదాపు సమానస్థాయిలో సీట్లు దక్కే అవకాశం కనపడుతోంది. ఎన్నో ఏళ్లుగా నితీశ్‌ కుమార్‌కు సీఎం పదవిని అప్పజెప్పుతున్న బీజేపీ ఈ సారి మాత్రం ఆ ఆలోచనలో లేదన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక, కొంత కాలంగా నితీశ్ కుమార్‌ శారీరకంగా ఉత్సాహంగా కనపడడం లేదు. ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు, ఆయన మానసికంగానూ బలంగా లేరని కూడా ప్రచారం జరుగుతోంది.

బీజేపీ ఇవాళ 11 గంటల సమయం నాటికి ఎన్డీఏ 190 స్థానాల్లో, మహాఘట్‌బంధన్ 50, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

పార్టీల వారీగా బీజేపీ ఇవాళ 11.30 సమయానికి 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జేడీయూ 75 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆర్జేడీ 34, కాంగ్రెస్ 7, జేఎస్పీ 0, ఇతరులు 43 స్థానాల్లో (ఎన్డీఏ, మహాఘట్‌బంధన్, స్వతంత్రులు) ఆధిక్యంలో ఉన్నారు.

బిహార్‌ ఎన్నికలు-2020లో ఎన్డీఏ 125 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 74, జనతా దళ్‌ (యునైటెడ్‌) 43, వికాస్‌శీల ఇన్సాన్‌ పార్టీ, హిందుస్థానీ అవామ్‌ మోర్చా తలా 4 స్థానాలు గెలిచాయి. ఈ పార్టీలన్నీ ఎన్డీఏలోవే.

ఆ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌లోని రాష్ట్రీయ జనతా దళ్‌ 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, నితీశ్‌ కుమార్‌కు సీఎం పదవి అప్పజెప్పింది. “పల్టీ రామ్‌”గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు. బీజేపీతో విభేదాలు వచ్చినప్పుడు ఆర్జేడీతో కలుస్తున్నారు. ఆర్జేడీతో విభేదాలు వచ్చినప్పుడు బీజేపీతో కలుస్తున్నారు. సీఎం సీటును మాత్రం తానే తీసుకుంటున్నారు.

ఈ సారి బీజేపీ నేతకు సీఎం పదవి దక్కుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బిహార్‌ డిప్యూటీ సీఎంలుగా ఇన్నాళ్లు విజయ్‌ కుమార్‌ సిన్హా, సమ్రాట్‌ చౌదరి ఉన్నారు. బీజేపీ నేతకు సీఎం పదవి దక్కితే వీరిద్దరిలో ఒకరికి సీఎం పదవి ఇస్తారా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అయితే, ఆరోగ్యపరంగా బాగుంటే మాత్రం నితీశ్ కుమార్‌ సీఎం పదవిని వదులుకునే ఛాన్సే లేదని గతంలో ఆయన ప్రవర్తించిన తీరును బట్టి చెప్పవచ్చు.

Also Read: బిహార్‌లో ఎన్డీఏ సునామీ.. మూడింట రెండొంతుల సీట్ల దిశగా..