బిల్లుకి ఆమోదం : పాక్, బంగ్లా ముస్లిమేతరులకు భారత పౌరసత్వం

కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. విపక్షాలు కాదన్నా, వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యింది. పౌరసత్వం బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు(హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పౌరసత్వం బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ బిల్లుని విపక్షాల ఎంపీలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆరేడేళ్లుగా దేశంలో నివసిస్తున్న విదేశీ వలసదారులకు భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో.. కేంద్రం పౌరసత్వం సవరణ బిల్లు-2016ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలు.. బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ బిల్లును తప్పుబట్టాయి. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలకు విరుద్ధమైన బిల్లు అని వాదించాయి. అసోంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అసోం గణ పరిషత్ సైతం బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో బిల్లుని ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని తృణమూల్ కాంగ్రెస్ వాదించింది. ముస్లింలు కాకుండా ఆరు ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఈ బిల్లుతో అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని ఈశాన్యా రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.