గాంధీ జాతిపిత కాదు..బీజేపీ ఎంపీ సాధ్వీ

సార్వత్రిక ఎన్నికల సమయంలో గాంధీని హత్య చేసిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం,దివంగత ఐపీఎస్ ఆఫీసర్ పై ఎన్నికల ముందు వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన భోపాల్ బీజేపీ ఎంపీ తన నోటికి ఆ తర్వాత కూడా పదును చెబుతూనే వచ్చారు. అయితే కొన్ని రోజులుగా నోటికి తాళం వేసుకుని ఉన్న సాధ్వి ఇప్పుడు మరోమారు వార్తల్లో నిలిచారు. భోపాల్ రైల్వే స్టేషన్ దగ్గర సోమవారం(అక్టోబర్-21,2019) జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సమయంలో బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో మీరెందుకు పాల్గొనడం లేదు అని మీడియా ఆమెను ప్రశ్నించగా…గాంధీ జాతిపిత కాదు. ఈ దేశం కన్న గొప్ప బిడ్డ. ఈ దేశం కోసం కష్టపడ్డారు. అందుకు మేం ప్రశంసిస్తాం. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తాం.
ఇంతకుమించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సూటిగా సమాధానమిచ్చారు. ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై సాధ్వీ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.