BJP : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ.. తెలంగాణపై మరింత ఎక్కువ

తెలంగాణను భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రత్యేకంగా భావిస్తోంది.

BJP : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ.. తెలంగాణపై మరింత ఎక్కువ

BJP's special attention on southern states more on Telangana

Bharatiya Janata Party : తెలంగాణను భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రత్యేకంగా భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కమలదళం..తొలి జాబితాలో తెలంగాణలో 9 స్థానాలను ప్రకటించింది. కేరళలో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొన్నటివరకు అధికారంలో ఉన్న కర్ణాటకకు, పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేని తమిళనాడుకు తొలిజాబితాలో చోటు కల్పించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచి.. 17 స్థానాల్లో రెండోస్థానంలో నిలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వీలయినన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీలో మొదటినుంచీ ఉన్న వారితో పాటు చేరికలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తవారికీ పెద్దపీట వేస్తోంది.

బీజేపీ 195 మంది జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిదిస్థానాలకు చోటు దక్కింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానమైన సికింద్రాబాద్ నుంచే బరిలో దిగనున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవే స్థానాలు కేటాయించింది బీజేపీ. బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి పోటీచేస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన పోతుగంటి భరత్‌ప్రసాద్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు తొలిజాబితాలోనే చోటు దక్కింది. నాగర్ కర్నూల్ నుంచి పోతుగంటి భరత్, సిట్టింగ్ స్థానం నుంచే బీబీ పాటిలో కమలం పార్టీ గుర్తుపై పోటీ చేయనున్నారు. ఏడాదిన్నర క్రితం బీజేపీలో చేరిన బూర నర్సయ్యగౌడ్‌కు బీజేపీ భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. అత్యంత కీలకమైన హైదరాబాద్ స్థానంలో డాక్టర్ మాధవీలతకు టికెట్ ఇచ్చింది.

సంస్థాగతంగానూ పట్టుపెంచుకోవడంపై దృష్టి

తెలంగాణలో క్రమానుగతంగా బలోపేతం కావడంపై దృష్టిపెట్టిన బీజేపీ ఓ వైపు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూనే మరోవైపు సంస్థాగతంగానూ పట్టుపెంచుకోవడంపై దృష్టిపెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణపై కొన్నేళ్లుగా బీజేపీ హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

అదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున ప్రచారం జరపడం ద్వారా ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని కమలం పార్టీ వ్యూహం రచించింది. అందులో భాగంగానే తొలి విడతలోనే తొమ్మిది స్థానాలను ఖరారు చేసేసింది. సీనియర్లతో పాటు కొత్తవారికీ జాబితాలో చోటు కల్పించింది. సీట్లు దక్కించుకున్న నేతలు ఇకనుంచి నియోజకవర్గాల్లో కలియతిరగనున్నారు. బండి సంజయ్ లాంటి వారు ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచారు.

కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ తొలి జాబితాలో ఆ రాష్ట్ట్రానికి చోటు కల్పించలేదు. తమిళనాడు విషయంలోనూ బీజేపీ దూకుడుగా వెళ్లడం లేదు. తెలంగాణలోలానే కేరళలో వీలయినన్ని ఎక్కువ స్థానాలు గెలుపొందాలన్నది బీజేపీ వ్యూహం. 2019-2024 మధ్య శబరిమల, పినరయి విజయన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, కేరళలో మత ప్రభావంవంటి అంశాలు తమ బలం పెంచాయని కమలం పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వీలైన‌న్ని ఎక్కువ‌ సీట్లు..

370 స్థానాల్లో గెలవాలన్న టార్గెట్ చేరుకోవడానికి ఎంత బలం ఉన్నప్పటికీ మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలపై ఆధారపడడం సరికాదని దక్షిణాదిన వీలయినన్ని ఎక్కువసీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది. బడ్జెట్ తర్వాత తెరపైకి వచ్చిన ప్రత్యేక దక్షిణ భారత దేశం, వివక్ష వంటి అంశాలకు ఎన్నికల్లో సీట్లు, ఓట్లు సాధించడం ద్వారా చెక్‌ పెట్టాలన్నది కమలదళం ఆలోచన. ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ కాంగ్రెస్ దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వివక్ష వంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని బీజేపీ అంచనావేస్తోంది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోనూ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలవాలన్నది బీజేపీ వ్యూహం. తెలంగాణ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపగలిగితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ విముక్తభారత్ లక్ష్యం నెరవేరడం ఏమంత కష్టం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.