ఎక్కడ చదువుకుని వచ్చారంటూ.. అన్నామలై, కంగనా రనౌత్‌పై కేటీఆర్ సెటైర్లు

బీజేపీ నాయకులు అన్నామలై, కంగనా రనౌత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎక్కడ చదువుకుని వచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎక్కడ చదువుకుని వచ్చారంటూ.. అన్నామలై, కంగనా రనౌత్‌పై కేటీఆర్ సెటైర్లు

Updated On : April 5, 2024 / 2:30 PM IST

KTR on Kangana Ranaut, Annamalai: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌స‌భ‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన గెలుపు కోసం ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్ కాంపెయిన్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. “నాకు ఒక విషయం చెప్పండి, మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, భారతదేశ మొదటి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్ళారు?” అంటూ కామెంట్ చేశారు. దీనిపై కేటీఆర్ సెటైర్ వేశారు.

“ఉత్తరాదికి చెందిన బీజేపీ ఒకరు అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ మా మొదటి ప్రధాని అని చెప్పారు!! దక్షిణాదికి చెందిన మరొక బీజేపీ నాయకుడు మహాత్మా గాంధీ మా ప్రధాని అని చెప్పారు!! వీళ్లంతా ఎక్కడ నుంచి పట్టభద్రులయ్యారు?” అంటూ కేటీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. మహాత్మా గాంధీ ప్రధాని అంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 

కాగా, ఇంతకుముందు కంగనా రనౌత్‌ఫై వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన యూపీకి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఛైర్మన్ సుప్రియ శ్రీనాథే.. కూడా తాజాగా స్పందించారు. “ఆమెను తేలికగా తీసుకోకండి – ఆమె బీజేపీ నాయకుల జాబితాలో ముందుకు సాగుతున్నారు” అంటూ సెటైర్ వేశారు.

Also Read: కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా వాగ్మూలం ఇచ్చాక మోదీ ఫొటో పెట్టుకుని ఓటు అడుగుతున్నారు..

నోటికి వచ్చింది మాట్లాడి వివాదాల్లో చిక్కుకోవడం కంగనా రనౌత్‌కు కొత్తేం కాదు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాతే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించి గతంలో విమర్శలకు గురయ్యారు. మోదీ అండదండలతో బీజేపీలో చేరి తాజాగా ఎంపీ బరిలో నిలిచారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు ఎంపీ స్థానాలకు జూన్ 1న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.