ఈ ఏడాది చివర్లో కరోనా వ్యాక్సిన్ రావడం అనుమానమేనా? మహమ్మారితో మరి కొంత కాలం సహజీవనం తప్పదా?

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైరస్‌ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్‌కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్‌ఐఐ సీఈవో అదర్ పునావాలా. ఇందుకు సంబంధించిన ప్రయోగాలు ఆగస్ట్‌లో ప్రారంభమవుతాయని.. అక్టోబరు-నవంబరు కల్లా కరోనా టీకా సిద్ధమయ్యే అవకాశాలున్నాయని ఏస్‌ఐఐ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఆక్స్‌ఫర్డ్ టీకా కొవిషీల్డ్ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలను ఇచ్చింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక పరిమాణంలో టీకాలను ఉత్పత్తి చేసే సంస్థ ఎస్‌ఐఐనే. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకాను ఉత్పత్తి చేసేందుకుగాను బయో ఫార్మాసూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికాతో ఈ సంస్థ జట్టు కట్టింది. దేశీయంగా భారత్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాక్జిన్‌ను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్‌యూఎంలో ఇప్పటికే స్క్రీనింగ్ ప్రారంభమైంది.
డిసెంబర్‌లో రిలీజ్…టీకా ధర వెయ్యి రూపాయల లోపేనన్న ఎస్‌ఐఐ చైర్మన్
కుదిరితే అక్టోబరు లేదంటే నవంబరు కల్లా ఆక్స్‌ఫర్డ్ టీకా సిద్ధమవుతుందని అదర్ పూనావాలా చెబుతున్నప్పటికీ.. ఎస్‌ఐఐ ఛైర్మన్ సైరస్ పూనావాలా మాత్రం అది డిసెంబరులో విడుదలవుతుందని మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్ టీకా తొలి దశ క్లినికల్ ప్రయోగాలు ముగిశాయని.. రెండు, మూడో దశ ప్రయోగాలు ఆస్ట్రియాలో కొనసాగుతున్నాయన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని టీకాకు తక్కువ ధర నిర్ణయిస్తామన్నారు. అది కూడా వెయ్యి రూపాయల లోపే ఉంటుందన్నారు. భారత్‌లో కనీసం వంద కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమన్నారు సైరస్. అయితే ఇదెంత వరకు ఆచరణ సాధ్యమన్నది అప్పడే నిర్ధారణకు రాలేం. కానీ ప్రయోగాల్లో మాత్రం సానుకూల ఫలితాలు రావడం శుభపరిణామంగా చెప్పొచ్చు.
హైదరాబాద్ నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్..ఈనెల 20న ఇద్దరు వాలంటీర్లకు టీకా డోసు
స్వదేశీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొ వ్యాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ హైదరాబాద్ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి. తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా గురువారం మరో వాలంటీర్‌కు ఫేజ్-1 డోస్ ఇచ్చేందుకు నిమ్స్ ఆసుపత్రి వర్గాలు రెడీ అయ్యాయి. తొలిదశ మానవ ప్రయోగాల్లో భాగంగా ఈనెల 20న ఇద్దరు వాలంటీర్లకు టీకా డోసు ఇచ్చారు. వారిని ఐసీయూలో 24 గంటలపాటు వైద్య బృందం పర్యవేక్షించింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో మరుసటి రోజు డిశ్ఛార్జి చేశారు. వాళ్లిద్దరికి ఎలాంటి అలర్జీలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో వాలంటీర్లను డిశ్చార్జి చేసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అటు విశాఖ కేజీహెచ్‌లోనూ ట్రయల్స్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.
రెండో దశలో.. ఆగస్ట్‌లో 375మంది ఎంపిక… వ్యాక్సిన్ భద్రత, స్క్రీనింగ్‌పై నిరంతరం స్టడీ
భారత్ బయోటిక్ ప్రయోగాలు ఈనెలాఖరుకల్లా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయనుంది. ఆగస్ట్‌లో 375మందిని ఎంపిక చేసి రెండో దశ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటిక్ కో వ్యాక్సిన్‌ను డెవలప్ చేసింది. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ కో వ్యాక్సిన్ భద్రత, స్క్రీనింగ్‌ను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తోంది. అలాగే పూణేకు చెందిన ఎన్‌ఐవీ టీకా రోగా నిరోధక ప్రతిస్పందనను పర్యవేక్షిస్తోంది. ఎస్‌ఐఐతో పాటు భారత్ బయోటిక్‌తో పాటు మరో ఐదు భారతీయ సంస్థలు వ్యాక్సిన్ రేసులో ముందున్నాయి. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ తీసుకొస్తామని సంస్థలు చెబుతున్నప్పటికీ అదంత ఈజీగా కనిపించడం లేదు.
ప్రయోగాల్లో మిగతా దేశాల కంటే ముందుగా భారత్… 9నెలల సమయం పడుతుందన్న సీసీఎంబీ
కరోనాకు చెక్ పెట్టేందుకు మన దేశంలో జోరుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మిగతా దేశాల కంటే మనమే ముందున్నాం. అయితే భారత్ బయోటిక్ కో వ్యాక్సిన్ మాత్రం చాలా ఆశలు పుట్టిస్తోంది. మనుషులపై మూడు దశల ప్రయోగాలు జరపాలి. ఇందుకోసం దాదాపు 9నెలల సమయం పడుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ సామర్థ్యం.. అదే పనిచేసే విధానం అంచనా వేయాల్సి ఉంటుంది. ఎలాంటి దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాతే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాక్సిన్ సక్సెస్ అయితే ఉత్పత్తి, పంపిణీ కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దశలు దాటాలంటే చాలా సమయం పడుతుందనేది శాస్త్రవేత్తల వాదన.
మరికొంత కాలం కాపురం చేయాల్సిందేనా?
ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్‌ను రూపుమాపేందుకు వ్యాక్సిన్ అభివృద్ధే ఏకైక పరిష్కారం. కానీ అదంత సులువేనా…? మన భారతీయ సంస్థలు మాత్రం ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కానీ వైద్య నిపుణులు మాత్రం వచ్చే ఏడాదికల్లా వ్యాక్సిన్ వచ్చే ఛాన్సే లేదని అంటున్నారు. డాక్టర్ల అభిప్రాయాలు, అంచనాల ప్రకారం మరికొంత కాలం వైరస్‌తో కాపురం చేయాల్సిందేనని స్పష్టమవుతోంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వచ్చినా దాని ఉత్పత్తి మరో సవాల్‌గా మారుతుందంటున్నారు. వాళ్లందరికి కోట్లకొద్ది డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వ్యాక్సిన్ ఉత్పత్తి, ఎగుమతికి చాలా నెలలు పడుతుందన్నది డాక్టర్ల వాదన. ముందు ముందు ఇండియాలో 60 నుంచి 70శాతం కరోనా బారిన పడితే వాళ్లందరికి వ్యాక్సిన్ అందించాలంటే ఎంత లేదన్నా కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
మూడో దశ ప్రయోగాలు జరగాల్సి ఉంది..
ప్రపంచదేశాల్లో వందకు పైగా వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిలో ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లు కూడా దాటాయి. మూడోదశ ప్రయోగాలు జరగాల్సి ఉంది. వచ్చే నెలలో ప్రారంభం అవుతాయని సంస్థలు, యూనివర్శిటీలు ప్రకటించాయి. మూడోదశ కూడా దాటితే అప్పుడు ఓ క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనుషులపై జరుపుతున్న ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వస్తే భారత్‌కు తిరుగులేనట్టే లెక్క.