వైష్ణోదేవి భక్తులకు కానుక : పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్

  • Published By: madhu ,Published On : October 3, 2019 / 05:37 AM IST
వైష్ణోదేవి భక్తులకు కానుక : పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Updated On : October 3, 2019 / 5:37 AM IST

బుల్లెట్‌లా దూసుకెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీలో మరోసారి పట్టాలెక్కింది. ఇప్పటికే ఢిల్లీ – వారణాసి మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తున్న తెలిసిందే. ఇక నుంచి ఢిల్లీ – కట్రా మార్గంలో కూడా సేవలందించనుంది. నవరాత్రుల సందర్భంగా వైష్ణోదేవి భక్తుల కోసం దీన్ని ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అక్టోబర్ 03వ తేదీ గురువారం ప్రారంభించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, హర్షవర్ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

ఢిల్లీ టు కట్రా ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. కాగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రయాణ సమయం 8 గంటలకు తగ్గుతుంది. ఢిల్లీ నుంచి కట్రా ప్రయాణించేందుకు టికెట్ ధరలు 16 వందల నుంచి 3వేల వరకు ఉన్నాయి. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలందిస్తుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, కట్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3గంటలకు కట్రాలో బయల్దేరి రాత్రి 11గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. దేశంలో రద్దీగా ఉండే మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ – ముంబై, ఢిల్లీ – హౌరా రైలుమార్గాల్లో వచ్చే డిసెంబర్ నాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు తెలిపారు. దేశంలో 2022 కల్లా 40 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వేబోర్డు అధికారులు చెప్పారు.