పీఎం కిసాన్ ‘స్కామ్’: రైతుల పేరిట రూ.110కోట్లు కొట్టేశారు

  • Published By: vamsi ,Published On : September 11, 2020 / 06:37 AM IST
పీఎం కిసాన్ ‘స్కామ్’: రైతుల పేరిట రూ.110కోట్లు కొట్టేశారు

Updated On : September 11, 2020 / 10:31 AM IST

అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన’. అయితే ఈ పథకంలో భారీ అవనీతి ఇప్పుడు బయటపడింది. తమిళనాడులో పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనలో 110 కోట్ల కుంభకోణం లేటెస్ట్‌గా బయటకు వచ్చింది. ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకుల సహాయంతో ఆన్‌లైన్ మోసం ద్వారా ఈ కుంభకోణం జరిగింది.



ప్రాథమిక అంచనాల ప్రకారం, కరోనావైరస్ వ్యాప్తి చెందిన తరువాత, సుమారు ఐదున్నర మిలియన్ల మందిని ఈ జాబితాలో చేర్చారు, ఇందులో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ తరువాత, ప్రభుత్వం ఈ పథకం కింద క్లియరెన్స్ నిబంధనలో కొంత మినహాయింపును ఇచ్చింది. దీనిని వాడుకుని తమిళనాడులో దోపిడీ చేశారు కొందరు ప్రబుద్ధులు.

మొత్తం 5.5 ల‌క్షల మంది అన‌ర్హుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున రూ.110 కోట్లు జమ అయ్యాయి.‌ ఇవన్నీ ఫేక్ అకౌంట్లేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భారీ కుంభకోణంపై తమిళనాడు ప్రభుత్వం సీబీసీఐడీ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీ గగన్‌దీప్ సింగ్ బేడి మాట్లాడుతూ.. ఆగస్టులో ఈ పథకంలో అనర్హులు పెద్ద సంఖ్యలో చేరారని చెప్పారు.



ఆగస్టు నెలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మొత్తం 45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, ఇది 2020 మార్చిలో 39 లక్షలుగా ఉంది. ఒక్క నెలలోనే ఆరు లక్షల వరకు లబ్ధిదారులు పెరిగారు. ఈ కేసులో 18 మంది ఏజెంట్లను అరెస్టు చేశారు, రైతులకు సంబంధించిన పథకాల అమలు నుండి 80 మంది అధికారులను తొలగించగా, 34 మంది అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన అధికారులలో వ్యవసాయ శాఖకు చెందిన ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఉన్నారు.
https://10tv.in/police-speed-up-investigation-in-serial-actor-sravani-case/
ఈ కుంభకోణంలో 110 కోట్ల రూపాయల్లో 32 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. చాలావరకు బ్యాంకు ఖాతా నుండి నేరుగా తిరిగి ఇవ్వబడింది. మిగిలిన మొత్తాన్ని రాబోయే 40 రోజుల్లో తిరిగి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చేయవచ్చని గగన్‌దీప్ సింగ్ బేడి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్ల ద్వారా క్రైమ్ సిండికేట్ పనిచేస్తోంది. బ్రోకర్లు ప్రజల నుంచి సమాచారాన్ని తీసుకుని అప్లై చేశారని, ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన కింద అధికారులు ఆమోదించారని చెబుతున్నారు.



కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తరువాత, కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం బిజీగా ఉందని బేడి చెప్పారు. ఈ కాలంలో లబ్ధిదారుల జాబితా అకస్మాత్తుగా పెరిగిపోయింది. అంతకుముందు జిల్లా కలెక్టర్లు వారి భూ రికార్డులు, రేషన్ కార్డులను తనిఖీ చేసి లబ్ధిదారుల పేర్లను ఆమోదించేవారు.

కల్లకూరిచి, కడలూరు, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, వెల్లూరు, తిరువన్నమలై సహా 13 జిల్లాల నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో అర్హత ఉన్న కొద్దిమంది రైతులను మాత్రమే జాబితాలో చేర్చారు. మిగతా 25 జిల్లాల్లో కొద్దిమంది లబ్ధిదారులను మాత్రమే ఈ జాబితాలో చేర్చారని సిబి-సిఐడి అధికారి చెప్పారు. అనర్హులు చాలా మందికి దీని గురించి తెలియదు. ‘కరోనా క్యాష్’ అని పిలువబడే ప్రభుత్వ పథకం సహాయం పేరుతో బ్రోకర్లు వారి వివరాలను తెలుసుకున్నారు.



కేంద్రం కల్పించిన ‘సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ’ కారణంగానే రాష్ట్రంలో 110 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి అన్నారు.