Rahul Gandhi:పంజాబ్‌ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్ గాంధీ

పంజాబ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తుల కష్టపడుతోంది

Rahul Gandhi:పంజాబ్‌ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్ గాంధీ

Updated On : February 6, 2022 / 6:07 PM IST

Rahul Gandhi: పంజాబ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తుల కష్టపడుతోండగా.. సీఎం సీటు విషయంలో మాత్రం గతకొంతకాలంగా అయోమయం నెలకొని ఉంది.

ఎట్టకేలకు పంజాబ్‌లో కాంగ్రెస్‌ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో స్పష్టం చేశారు.

పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థియని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇది నా నిర్ణయం కాదని, పంజాబ్‌ నిర్ణయమని రాహుల్‌గాంధీ వెల్లడించారు.

పంజాబ్ పేదల సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తే సీఎంగా కావాలని కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకే సీఎం పదవిని ప్రకటించినట్లు చెప్పారు. సీఎం పదవిని ప్రకటించే సమయంలో రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సునీల్ జాఖర్ కూడా ఉన్నారు.

సీఎం పదవిని ప్రకటించిన తర్వాత.. పంజాబ్ ప్రజల కోసం నేను నిద్రపోనని చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చెప్పుకొచ్చారు. పంజాబ్ కోసం నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏమి చేయాలనుకున్నా తోడుగా ఉంటాను. సునీల్ జాఖర్ జీ చేయాలనుకున్నది ఆయన చేయవచ్చు. అందరం కలిసి పంజాబ్‌ను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

సీఎం పదవి అభ్యర్థిని ప్రకటించే ముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. తగాదా అనేది ప్రియమైనవారితో కాదని, అపరిచితులతో మాత్రమేనని అన్నారు. సిద్దూ ఆ మాట అనగానే చన్నీ లేచి సిద్ధూని కౌగిలించుకున్నారు.