Maoist attack : చత్తీస్‌గఢ్ మావోల దాడి : బలగాలను రప్పించేందుకు పక్కా స్కెచ్
అడవిలో మళ్లీ అలజడి రేపారు మావోయిస్టులు. చత్తీస్ గఢ్ అడవుల్లో రక్తం చిందేలా హింసోన్మాదానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలపై మెరుపుదాడి చేసి అత్యంత పాశవికంగా కాల్పులతో హతమార్చారు.

Chhattisgarh Maoist Attack How A Massive Security Operation Was Planned
Chhattisgarh Maoist attack : అడవిలో మళ్లీ అలజడి రేపారు మావోయిస్టులు. చత్తీస్ గఢ్ అడవుల్లో రక్తం చిందేలా హింసోన్మాదానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలపై మెరుపుదాడి చేసి అత్యంత పాశవికంగా కాల్పులతో హతమార్చారు. మావోల మెరుపు దాడిలో 22 మంది భద్రతా బలగాల సిబ్బందిని అమరులయ్యారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్న వివిధ భద్రతా బలగాల బృందాలపై మావోయిస్టులు మందుపాతర పేల్చారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రతీకార దాడికి దిగారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 23కు చేరింది.
మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ముందుగా మందుపాతర పేల్చి.. ఆ తర్వాత పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ముందుగా ఈ దాడిలో 8 మంది మరణించినట్లుగా గుర్తించారు. ఆదివారానికి మృతుల సంఖ్య 22గా తేలింది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సీరియస్‌గా ఉన్న వారిని రెండు హెలికాప్టర్లలో తరలించారు. దండ కారణ్యంలో అధునాతన ఆయుధాలతో అంబుష్ దాడికి పాల్పడ్డారని, అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు వెల్లడించారు. కొంతకాలంగా దండకారణ్యంలో జరుగుతున్న పీఎల్‌జీఏ వారోత్సవాలపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే పీఎల్‌జీఏ కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ మావోలు ట్రాప్ చేశారు. గాలం వేసి కాపు కాచారు.. భద్రతా బలగాలు రావడంతో ఒక్కసారిగా చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. మావోలను మట్టుపెట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టగా.. ఇందులో ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎస్‌టిఎఫ్, డిఆర్‌జి జిల్లా దళం, సిఆర్‌పిఎఫ్, ఎలైట్ కోబ్రా యూనిట్ ఉన్నాయి. బీజాపూర్ నుండి మాత్రమే 1,000 మంది సిబ్బంది ఉన్నారు. ఎనిమిది బీజాపూర్ జట్లలో ఆరు టారెం క్యాంప్ నుండి వచ్చాయి. మిగిలిన రెండు జట్లు ఉసూర్ పామేడ్ నుండి వచ్చాయి. ఆరు జట్లలో, మూడు- ఒకటి జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), మరొక DRG బృందం కోబ్రా బృందం – ఏప్రిల్ 2 రాత్రి 10 గంటలకు ప్రారంభించాయి.
తుపాకీ కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన జవాన్లు భారీ ఆపరేషన్‌లో ఎందుకు ఇలా జరిగిందో పోలీసు అధికారులు వివరించారు. బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో గాయపడిన జవాన్ ఒకరు మాట్లాడుతూ.. భద్రతా బలగాలు అక్కడికి వెళ్లేసరికి ఏమి కనిపించలేదని గాయపడిన జవాన్ ఒకరు తెలిపారు. తిరిగి వెళ్లేసమయంలో తమపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారని చెప్పారు. తిరిగి వస్తున్నప్పుడు నక్సల్స్ మమ్మల్ని అన్ని వైపుల చుట్టుముట్టారు. ఎప్పుడు బలగాలను చుట్టుముట్టారో మాకు నిజంగా తెలియదు. వారి వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటితోనే బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న రెండు గ్రామాలు, జిరాగావ్ టెక్లాగుడెం పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. రెండు గ్రామాలు ఖాళీ చేశారు. ఏదో తప్పు జరిగిందని మేము చాలా ఆలస్యంగా గ్రహించామని మరొక జవాన్ చెప్పారు.