వాళ్లు మనవాళ్లే…పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటినా బీజేపీ తన పంతాన్ని నెగ్గించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును ఇవాళ(డిసెంబర్-11,2019)పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభ ఆమోదం పొందింది. ఏడు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 125మంది ఓటు వేయగా,105మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
అంతకుముందు ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలా వద్దా అన్నదానిపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. సెలక్ట్ కమిటీకి పంపాలని 92మంది అనుకూలంగా ఓటు వేయగా, సెలక్ట్ కమిటీకి పంపొద్దని 113మంది ఓటు వేశారు. దీంతో సెలక్ట్ కమిటీకి బిల్లును పంపాలనే ప్రతిపాదనను రాజ్యసభ తిరస్కరించింది. మరోవైపు ఈ బిల్లుకు విపక్షాలు 43 సవరణలు ప్రతిపాదించాయి. ఈ బిల్లు సవరణలపై రాజ్యసభలో ఓటింగ్ జరుగగా ప్రభుత్వానికి అనుకూలంగా 124మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 99మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్లుకు సవరణలను రాజ్యసభ తోసిపుచ్చింది. మరోవైపు లోక్ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన శివసేన రాజ్యసభలో ఓటింగ్ కు దూరంగా ఉంది. ఓటింగ్ లో పాల్గొనకుండా రాజ్యసభ నుంచి శివసేన ఎంపీలు వాకౌట్ చేశారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్ఛే ముస్లిమేతర శరణార్ధులకందరికీ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ బిల్లును ఉద్దేశించారు. పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు) ఆరేళ్లుగా భారత్ లో స్థిర నివాసం ఉంటే, వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. తమ దేశాల్లో మత సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్నవారికి ఈ దేశంలో ఇక పౌరసత్వం లభిస్తుందన్న మాట.
#CitizenshipAmendmentBill2019 passed in Rajya Sabha;
125 votes in favour of the Bill, 105 votes against the Bill pic.twitter.com/P10IqkSlCs— ANI (@ANI) December 11, 2019