Amarinder Singh : రేపు పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ బాధ్యతల స్వీకరణ..హాజరయ్యేందుకు అమరీందర్ అంగీకారం

పంజాబ్‌ పీసీసీ చీఫ్ గా నవజోత్‌ సింగ్‌ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Amarinder Singh : రేపు పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ బాధ్యతల స్వీకరణ..హాజరయ్యేందుకు అమరీందర్ అంగీకారం

Punjab (1)

Updated On : July 22, 2021 / 7:04 PM IST

Amarinder Singh   పంజాబ్‌ పీసీసీ చీఫ్ గా నవజోత్‌ సింగ్‌ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్‌ సింగ్‌ దూరంగా ఉంటారంటూ ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఊహాగానాలకు చెక్ పెడుతూ..సిద్ధూ పీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమరీందర్ సింగ్ అంగీకరించారు.

అయితే కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ నియమకాన్ని వ్యతిరేకించిన సీఎం అమరీందర్‌ సింగ్‌, క్షమాపణలు చెప్పేంత వరకు ఆయనను కలువబోనని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొత్త పీసీసీ సారథి నియామకం తర్వాత సిద్ధూ, అమరిందర్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. అమరిందర్.. సిద్దూకు కనీసం అభినందనలు కూడా తెలపకపోవడం విశేషం. బుధవారం కూడా సిద్ధూ, అమరిందర్ పోటాపోటీగా ప్రజాప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే రాజీ సంకేతాలు ఇచ్చారు.

గురువారం మధ్యాహ్నాం… పంజాబ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు గా ఎన్నికైన నలుగురిలో ఇద్దరు(కుల్జిత్ సింగ్ నగ్రా,సంగత్ సింగ్ గిల్జైన్)సీఎం అమరీందర్ సింగ్ ని కలిసి రెండు ఆహ్వానపత్రికలు( 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఓ లేఖ, సిద్థూ వ్యక్తిగతంగా సీఎంని ఆహ్వానిస్తూ రాసిన లేఖ) అందజేశారు.

సీఎంతో మీటింగ్ అనంతరం కుల్జిత్ సింగ్ నగ్రా మాట్లాడుతూ…శుక్రవారం ఉదయం 11 గంటలకు చండీఘర్ లోని కాంగ్రెస్ భవన్ లో జరగనున్న పీసీసీ చీఫ్,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమరీందర్ సింగ్ అంగీకరించారని తెలిపారు.

కాగా,  సీఎం అమరీందర్ సింగ్.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలను శుక్రవారం ఉదయం తేనీటి విందు కోసం తన ఇంటికి ఆహ్వానించారు​. శుక్రవారం ఉదయం అక్కడి నుంచే అందరూ కలిసి పంజాబ్​ కాంగ్రెస్​ భవన్​కు వెళ్దామని సమాచారం ఇచ్చారు.   శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ వింధు జరిగిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ భవన్​కు వెళ్తారని సీఎం ప్రతినిధి తెలిపారు.