హైకమాండ్ ఆదేశిస్తే…ఛత్తీస్ ఘడ్ సీఎం రాజీనామా!

CM Bhupesh Baghel on TS Singh Deo’s comment: Will resign if high-command asks ఛత్తీస్ ఘడ్ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నట్లు తెలుస్తోంది. సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయన్న వార్తలతో.. సీఎం పీఠంపై అనిశ్చితి నెలకొంది.
శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో భూపేశ్ బఘేల్ మాట్లాడుతూ…తనకు పదవీ వ్యామోహం లేదన్నారు. తాను ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కొంత మందికి తనతో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సమస్యలున్నాయని తెలుసని అన్నారు. ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే.. వెంటనే నేను రాజీనామా చేస్తానంటూ సీఎం భూపేశ్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ లో కీలక నేత అయిన టీఎస్ సింగ్ దేవ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రెండున్నరేళ్లపాటు టీఎస్ సింగ్ దేవ్‌కు ముఖ్యమంత్రి పదవీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత.. రాహుల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సీఎం బూపేశ్ బఘేల్-సింగ్ దేవ్ల మధ్య విభేదాలు కూడా పెరుగుతున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం టీఎస్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో 2.5 ఫార్ములా అంశాన్ని ప్రస్తావించారు. ఏ ముఖ్యమంత్రికి కూడా కచ్చితమైన పదవీ కాలం ఉండదని, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని వివరించారు. ముఖ్యమంత్రి పదవిపై పార్టీ అధిష్ఠానం.. పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.