Ayodhya Deepotsav : హెలికాఫ్టర్ లో అయోధ్యకు సీతారాములు..రామభక్తులపై బుల్లెట్ల వర్షం కురిపించారన్న యోగి

దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అయోధ్య దీపోత్సవం' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రల

Ayodhya Deepotsav : హెలికాఫ్టర్ లో అయోధ్యకు సీతారాములు..రామభక్తులపై బుల్లెట్ల వర్షం కురిపించారన్న యోగి

Up (1)

Updated On : November 3, 2021 / 7:17 PM IST

Ayodhya Deepotsav దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘అయోధ్య దీపోత్సవం’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రలు ధరించిన కళాకారులను బుధవారం మధ్యాహ్నాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. వారికి రాజ తిలకం దిద్దారు. పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

అంతకుముందు వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్​లో లక్నో నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. అయోధ్య దీపోత్సవం కార్యక్రమంలో వియత్నాం, కెన్యా, ట్రినిడాడ్ అండ్ టుబాగో రాయబారులు సైతం పాల్గొన్నారు. వారు కూడా శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రలు ధరించిన కళాకారులకు రాజ తిలకం దిద్దారు.

ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అయోధ్యతో సహా 46 రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని బెదిరిస్తూ లష్కరేటర్ టెర్రరిస్టు కమాండర్ రాసినట్లుగా ఇటీవల బెదిరింపు లేఖ అందడంతో భద్రతను పెంచారు. అయోధ్యలోని ప్రతి గల్లీలో పోలీసులు కాపు కాస్తున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

కాగా,అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమాన్ని 2017 నుంచి యూపీ ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే 2017లో 51 వేల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈసారి అయోధ్యలో 12 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాలని యోగి సర్కార్ ఫ్లాన్ చేసింది. ఈ 12 లక్షల దీపాలలో 9 లక్షలు సరయు నది తీరాన ఉన్న రామ్ కీ పైడీ ఘాట్‌లో వెలిగించారు. మిగిలిన 3 లక్షల దీపాలు అయోధ్యలోని వివిధ మఠాల్లో వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం కూడా అయోధ్య విచ్చేసింది.

అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..”31 ఏళ్ల క్రితం అయోధ్యలో రామభక్తులు, కరసేవకులపై ఓ వర్గం బుల్లెట్లు ప్రయోగించింది. ఆనాడు… జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం… రామ మందిరానికి మద్దతు పలకడం నేరంగా పరిగణించారు.  రామభక్తులపై ఆనాడు కాల్పులు జరపాలని ఆదేశించి వాళ్లే… ఈనాడు అదే రామ భక్తులకు తల వంచి నమస్కరిస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి. ఈ రోజు మీరు ఇలాగే కొనసాగితే… వాళ్లు..  వారి కుటుంబం మొత్తం తదుపరి కరసేవ కోసం వరుసలో ఉంటారు. తదుపరి కరసేవ జరిగినప్పుడు, రాముడు – కృష్ణుడి భక్తులపై బుల్లెట్లు కాదు, పూల వర్షం కురిపిస్తారు. ఇది ప్రజాస్వామ్య శక్తి. వచ్చేసారి ‘కరసేవ’ జరిగినప్పుడు శ్రీరాముడు, కృష్ణుడి భక్తులపై బుల్లెట్లు కాదు, పూల వర్షం కురుస్తుంది” అన్నారు. కాగా, సోమవారం ప్రారంభమైన ఈ దీపోత్సవ కార్యక్రమం ఐదురోజుల పాటు సాగనుంది.

ALSO READ Abhinandan Varthaman : బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హీరోకి ప్రమోషన్