నిండిపోయేట్టు ఉంది : తీహార్ జైలుకి మరో కాంగ్రెస్ లీడర్

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు మొదట హాస్పిటల్ కు తీసుకెళ్ళాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కోర్టుతెలిపింది.
డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ అవసరమని చెప్తే, తదనుగుణంగా హాస్పిటల్ లో చేర్పించాలని, లేనిపక్షంలో ఆయనను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాిస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ధ్రువీకరించడంతో తీహార్ సెంట్రల్ జైలుకు ఆయనను గురువారం ఉదయం తరలించారు.
మనీలాండరింగ్ కేసులో శివ కుమార్‌ను ఈ నెల 3న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండు వారాలుగా కస్టడీలోనే ఉన్నారు. డీకే మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో బెళగావి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్ ఇవాళ ఉదయం ఈడీ ఎదుట హాజరయ్యారు.