భరత్ అనే నేను : కాంగ్రెస్ ప్రచారంలో సల్మాన్ ఖాన్

రాజకీయ నాయకులు ఎన్నికల వేళ సినీతారలతో ప్రచారం చేయించుకోవడం కొత్తేం కాదు. సినిమా తారలు వచ్చే మీటింగ్‌లకు జనాలు విపరీతంగా వస్తారు. అందుకే తారలను తమ తరుపున ప్రచారం చేసుకునేందుకు పార్టీలు వాడుకుంటాయి.
ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను తమ పార్టీ తరుపున ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో ఇండోర్‌లో కాంగ్రెస్ తరుపున సల్మాన్‌తో ప్రచారం చేయించేందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 1965లో ఇండోర్‌లో జన్మించిన సల్మాన్ ముంబైకి వెళ్లక ముందు బాల్యమంతా అక్కడే గడిపారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇక్కడి నుంచి సల్మాన్ ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇండోర్‌లో తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టేందుకు సల్మాన్‌తో సంప్రదింపులు జరిపామని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. సల్మాన్ తాత ఇండోర్‌లో సీనియర్ పోలీస్ అధికారిగా పనిచేశారని, సల్మాన్ బాల్యమంతా ఇక్కడే సాగిందని ఆయన వెల్లడించారు.
2009లో కాంగ్రెస్ ఇండోర్ మేయర్ అభ్యర్థి పంకజ్ సంఘవి తరపున సల్మాన్ రోడ్‌షోలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో కండలవీరుడి ప్రచారం కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు.