లాక్ డౌన్ : కార్మికులను కప్పగంతులు వేయించిన కానిస్టేబుల్

భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వలస కూలీలు, కార్మికులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఛీ కొడుతున్నారు.
వారికి సహాయం చేయాల్సింది పోయి..ఇలా వ్యవహరిస్తారా ? అంటూ మండిపడుతున్నారు. వారి వారి స్వగ్రామాలకు వెళుతున్న వారిని రోడ్డుపై కప్పగంతులు వేయించారు ఓ కానిస్టేబుల్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బడాన్ ప్రాంతంలో ఐదుగురు కార్మికులు స్వగ్రామాలకు వెళుతున్నారు. రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో వీరు రోడ్డుపై నడుచుకుంటూ…వెళుతున్నారు. ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నారు.
కప్పగంతులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లాలని ఆదేశించాడు. చేతిలో రెండు దుడ్డుకర్రలు పట్టుకుని బెదిరించాడు. చేసేది ఏమీ లేక..వారు ఆ కానిస్టేబుల్ చెప్పినట్టే చేశారు. నవేదా చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి వీడియోలు నెటింట్లో వైరల్ అయ్యాయి.
దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. క్షమాపణలు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై సిగ్గు పడుతున్నానని, క్షమాపణలు చెబుతున్నట్లు ఎస్పీ అశో్క్ కుమార్ త్రిపాఠి తెలిపారు. అతనిని సస్పెండ్ చేసినట్లు, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
విక్రాంత్ అనే కానిస్టేబుల్ మూడు నెలల క్రితం ట్రైనీ కానిస్టేబుల్ గా చేరినట్లు ఎస్పీ జితేంద్ర తెలిపారు. దీనిపై మరింత సమాచారం సేకరించడం జరుగుతుందని, తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం ఇతర జిల్లాలకు చెందిన వారు వారి స్వగ్రామాలకు వెళుతున్నారని స్థానికులు వెల్లడించారు.
See Also | కరోనా కేసుల్లో చైనాను దాటేసిన అమెరికా