Coromandel Express Accident : ఘోర రైలు ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం
Coromandel Express Accident : ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Coromandel Express Accident (Photo : Google)
Coromandel Express : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు.
షాలిమార్ (కోల్ కతా) నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (12841).. ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టి పట్టాలు తప్పింది. అదే సమయంలో పక్క ట్రాక్ లో వెళ్తున్న యశ్వంత్ పూర్-హౌరా ట్రైన్ (బెంగళూరు నుంచి కోల్ కతా వెళ్తోంది) కోరమాండల్ ట్రైన్ బోగీలను ఢీకొడుతూ వెళ్లిపోయింది. ఆ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి.
దీంతో ఘోరం జరిగిపోయింది. మరో రైలు ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కేంద్రం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేసింది కేంద్రం. ఇక తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ యాక్సిడెంట్ లో 7 బోగీలు బోల్తా పడ్డాయి. వాటి కింద ప్రయాణికులు చిక్కుకుపోయారు. శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.
మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 4 ఒడిశా విపత్తు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 15 ఫైర్ రెస్క్యూ టీమ్స్, 30మంది డాక్టర్లు, 200 మంది పోలీసులు, 60 అంబులెన్సులను ప్రమాద స్థలానికి పంపించారు. సహాయక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.