భారత్‌లో 9లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 9లక్షల 6వేల 752కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న(జూలై 13,2020) ఒక్కరోజే 553 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 23వేల 727కి పెరిగింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 5లక్షల 71వేల 460 మంది కోలుకున్నారు. 3లక్షల 11వేల 565 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.02శాతంగా ఉండగా మృతుల రేటు 2.64శాతంగా ఉంది.
2 వారాల్లోనే 3లక్షల కేసులు, 6వేల మరణాలు:
దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు బయటపడ్డాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశంలో జులై 1నుంచి ఇప్పటివరకు దాదాపు 3లక్షల 21వేల 259 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. గడిచిన రెండు వారాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 6వేల 327మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఈ సంఖ్య అధికంగా ఉంది.
కరోనా టెస్టులు @ కోటి 20లక్షలు:
దేశంలో కరోనా విజృంభణ పెరుగుతుండడంతో నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా నిర్వహిస్తోంది. జులై 13 నాటికి దేశంలో కోటి 20లక్షల శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1200 కేంద్రాలకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. నిత్యం దాదాపు 2లక్షల శాంపిళ్లకు నిర్ధారణ పరీక్షలు జరుపుతోంది. ఇక మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6వేల 497 కేసులు, దేశ రాజధాని ఢిల్లీలో 1246 కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసుల్లో మూడో స్థానంలో భారత్:
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసుల సంఖ్య కోటి 32లక్షల 36వేల 252కి పెరిగింది. 5లక్షల 75వేల 540 మంది కరోనాతో చనిపోయారు. 76లక్షల 91వేల 451 మంది కోలుకున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచంలో తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికా. అమెరికాలో 34లక్షల 79వేల 483మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 38వేల 249మంది చనిపోయారు. అమెరికా తర్వాత బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ లో 18లక్షల 87వేల 959 కరోనా కేసులు నమోదయ్యాయి. 72వేల 921 మంది కరోనాతో చనిపోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ ఉంది. భారత్ లో 9లక్షల 7వేల 645 కేసులు, 23వేల 727 మరణాలు నమోదయ్యాయి.