కఠినంగా లాక్ డౌన్…బోర్డర్లు మూసివేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 10:04 AM IST
కఠినంగా లాక్ డౌన్…బోర్డర్లు మూసివేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Updated On : March 29, 2020 / 10:04 AM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాల మధ్య సరిహద్దులు,జిల్లాల మధ్య పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో కాలంలో ఎటువంటి కోత లేకుండా కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చూడాలని కేంద్రం తెలిపింది.

ఈ కాలానికి(లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు) గృహ అద్దె డిమాండ్ చేయకూడదు. కార్మికులను లేదా విద్యార్థులను ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అడుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని కేంద్రం చెప్పింది. వలస కార్మికులతో సహా పేద ప్రజల ఆహారం మరియు ఆశ్రయం కోసం తగిన ఏర్పాట్లు వారి పని ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కేంద్రం తెలిపింది. ఈ ప్రయోజనం కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులను ఉపయోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000కి చేరువలో ఉండగా.. 25మంది ప్రాణాలు కోల్పోయారు.