Covid Cases in India : పెరుగుతున్న కొవిడ్ కేసులు.. 24గంటల్లో దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కొవిడ్ బారిన పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది.

Covid Cases
COVID Subvariant JN.1 : దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కొవిడ్ బారిన పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 655 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా కేరళ రాష్ట్రంలో ఒకరు మరణించారు. దేశంలో ప్రస్తుతం 3,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజులో కేరళ రాష్ట్రంలో 424 కొత్త కొవిడ్-19 కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3వేల కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో 12 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, ఏపీలో ఆరు, తమిళనాడులో 21, కర్ణాటకలో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 38, ఏపీలో 18 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జేఎన్.1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు కొవిడ్ వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు.
Also Read : Corona virus: విశాఖ ప్రజలను కలవరపెడుతున్న కరోనా.. పెరుగుతున్న కొవిడ్ కేసులు
కొవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తుంది..
దేశ ప్రజలను కొత్త వేరియంట్ జేఎన్.1 కలవరపెడుతుంది. అయితే, జేఎన్.1 వేరియంట్ కు వ్యతిరేకంగా కోవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఏఐఐఎంఎస్ మాజీ డైరెక్టర్, సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడారు. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ గా జెఎన్.1 వేరియంట్ ఉంది. కాబట్టి గత వ్యాక్సిన్స్ కి జెఎన్.1 వేరియంట్ ఎదుర్కొగల శక్తి ఉంటుందని తెలిపారు. వ్యాక్సినేషన్ చేసిన ప్రజల ప్రస్తుత రోగనిరోధక శక్తి, టీకా రక్షణ ఏ విధంగా ఉందో తెలపడానికి మాకు మరింత డేటా అవసరం అన్నారు. దాని ఆధారంగా, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్ కొత్త వ్యాక్సిన్ అవసరమా అనేది చెప్పగలమని రణదీప్ గులేరియా చెప్పారు. వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా చేయవలసిన పని ఎందుకంటే వేరియంట్ లు మారుతూ ఉంటాయని చెప్పారు.