ఒడిశా వైపు దూసుకెళ్తోన్న ఫొని తుఫాన్

సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్ వడి వడిగా దూసుకొస్తోంది. ఇప్పటికే సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని… విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. నిన్న రాత్రి సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్…ఒడిశా వైపు దూసుకెళ్తోంది. శుక్రవారం (మే3, 2019) ఉదయం ఒడిశాలోని పూరీకి సమీపంలోని బలుకుండో వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫొని తుఫాన్ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో గంటకు 200 కిలోమీటర్ల ప్రచండవేగంతో… తీరం దాటే సమయంలో 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంగా పెను గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఫొని తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతోంది. వర్షం, ఈదురు గాలులతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు హోరెత్తుతున్నాయి. అటు 20నుంచి 30 మీటర్ల వరకు సముద్రం ముందుకొస్తోంది. 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు.. తీర ప్రాంతాల్లో హై రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో తూర్పు కోస్తా పరిధిలో 107 రైళ్లను రద్దు చేశారు. భద్రక్-విజయనగరం, పూరి-భువనేశ్వర్ మార్గాల్లో రైళ్లు రద్దు అయ్యాయి.