Delhi Blast : ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. బాంబు పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తి అతనే.. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ
Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు చేస్తున్నా కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి
Delhi Blast
Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు చేస్తున్నా కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ సాహీన్ సయీద్, డాక్టర్ గనయీలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదేరోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన విధ్వంసకర బాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన సీసీ పుటేజీల ప్రకారం.. బాంబు పేలుడు సాయంత్రం 6.52 గంటకు జరిగినట్లు స్పష్టమైంది. అయితే, పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని దర్యాప్తు బృందాలు అనుమానించాయి. ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించిన విషయ తెలిసిందే. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు.
ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి కుటుంబ సభ్యుల (ఒమర్ తల్లి, సోదరుడు) నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారు శిథిలాల నుంచి లభించిన అవశేషాలతో (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) సరిపోలాయి. దీంతో పేలుడు జరిగే సమయానికి ఉమర్ కారులోనే ఉన్నాడని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
ఉమర్ నబీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడం గురించి ప్రతిసారీ ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని తెలిసింది. డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్ తో కలిసి దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను అతడు సేకరిస్తున్నట్లు, వాటిని ఉపయోగించి పాక్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపడింది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్‌ను విచారించినప్పుడు ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం.
