Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. లిక్కర్ కేసులో బెయిల్‌పై స్టే..!

Arvind Kejriwal : ఈ నెల 20న కేజ్రీవాల్‌కి ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు తీర్పును ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. లిక్కర్ కేసులో బెయిల్‌పై స్టే..!

Delhi High Court stays Arvind Kejriwal’s bail ( Image Source : Google )

Updated On : June 25, 2024 / 4:00 PM IST

Arvind Kejriwal : లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు చుక్కదురైంది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే విధించింది. దాంతో తీహార్ జైలులోనే కేజ్రీవాల్ ఉండనున్నారు.

ఈ నెల 20న కేజ్రీవాల్‌కి ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు తీర్పును ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందని, దానికి ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు తమ వాదన, ఆధారాలను పరిగణలోకి తీసుకోకుండానే బెయిల్ మంజూరు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వ్యతిరేకించింది. ఈడీ వాదనతో ఏకిభవిస్తూ.. ట్రయల్ కోర్టు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

అంతకుముందు, తనకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ రౌస్‌ అవెన్యూ కోర్టును కేజ్రీవాల్‌ ఆశ్రయించారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు ఆప్ అధినేతకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌లో కేజ్రీవాల్‌ ప్రమేయం నేరుగా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపిస్తోంది.

అయితే, కోర్టుకు ఆధారాల్ని ఈడీ అందించడంలో విఫలమైందనే కారణంతో రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే విధించింది. దీనిపై విచారణ చేపట్టాలని ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ నెల 26న విచారణ జరుగనుంది.

Read Also : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాట్ కామెంట్స్