Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్ సింగ్ పేరు.. ఆయన ఏమన్నారంటే?
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.

Digvijaya Singh
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన తరువాత.. ఊహించని రీతిలో అధ్యక్ష పదవి పోటీకి గెహ్లాట్ విముఖత వ్యక్తంచేశారు. దీనికితోడు ఊహించని విధంగా రాజస్థాన్లో తలెత్తిన పరిణమాలతో అధ్యక్ష పదవికి గెహ్లాట్ అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. రాజస్థాన్లో తన అనుచరగణానికే (ఎమ్మెల్యేలు) నచ్చచెప్పలేని గెహ్లాట్… పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు ఎలా చక్కబెడతారనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ప్రస్తుతం సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. గెహ్లాట్ తీరుతో సోనియా ఆగ్రహంతో ఉన్నారని, దిగ్విజయ్ సింగ్ వైపు ప్రస్తుతం సోనియా, కాంగ్రెస్ ముఖ్యనేతలు మొగ్గుచూపుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన గురు, శుక్రవారాల్లో నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర కోసం కేరళలో ఉన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు. నేను హైకమాండ్ నుండి అనుమతి తీసుకోలేదని, నేను పోటీ చేస్తానో లేదో నాకు వదిలేయండి అంటూ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి చేతికొస్తాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
కాగా, అధ్యక్ష ఎన్నికల నామినేషన్ గడువు మరో రెండు రోజుల్లో (ఈనెల 30వ తేదీ) ముగియనుంది. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడవు అక్టోబర్ 8వ తేదీతో ముగుస్తుంది. అదో రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుదిజాబితా రిలీజ్ అవుతుంది. ఎన్నికే అనివార్యమైతే అక్టోబర్ 17న పోలింగ్ జరుపుతారు. 19న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.