కేజ్రీవాల్ కీలక నిర్ణయం…కరోనా డ్యూటీలో ఉన్న డాక్టర్లకు లలిత్ హోటల్ లో బస ఏర్పాటు

ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలోని లోక్‌నాయక్, GB పంత్ హాస్పిటల్స్ లో కరోనా డ్యూటీలో పనిచేస్తున్న డాక్టర్లను లలిత్ హోటల్‌లో ఉంచనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం(మార్చి-30,2020) ప్రకటించింది. లలిత్ హోటల్ ఈ రెండు హాస్పిటల్స్ కు కిలోమీటరు కన్నా తక్కువ దూరంలోనే ఉంది.
కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న వైద్యనిపుణులు, ఆరోగ్య కార్యకర్తలను 14 రోజులపాటు లలిత్ హోటల్ లోనే ఉంచాలని ఆప్ సర్కార్ నిర్ణయించింది. ప్రాణాంతక ఈ వైరస్ డాక్టర్లు, వారి కుటుంబాలకు కూడా సోకుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ ప్రణాళిక ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. హోటల్ లో డాక్టర్ల వసతి ఖర్చులకు ఢిల్లీ ప్రభుత్వమే భరించనున్నట్లు ఇవాళ ఢిల్లీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఆర్డర్ లో తెలిపింది.
కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో డాక్టర్లు ముందువరుసలో నిలబడ్డారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ప్రభుత్వ హాస్పిటల్స్ అయిన లోక్ నాయక్ హాస్పిటల్ మరియు GB పంత్ హాస్పిటల్స్ లో కోవిడ్-19 డ్యూటీలో ఉన్న డాక్టర్లందరు లలిత్ హోటల్ లో ఉండనునన్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు దాదాపు 4 లక్షల మందికి ఉచిత ఆహారం అందివ్వడానికి 800కి పైగా ప్రత్యేక కేంద్రాలు,72 లక్షల మందికి ఉచిత రేషన్ అందివ్వడానికి వెయ్యికి పైగా షాపులు పనిచేస్తాయని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. నిరాశ్రయులు, వలస కార్మికుల కోసం ఢిల్లీ అంతటా 234 నైట్ షెల్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా రోజూవారీ కార్మికులు, వలస కూలీలకు వసతి కల్పించేందుకు పాఠశాలలను షెల్టర్లుగా మార్చాలని యోచిస్తుంది.
21 రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ తెలిపారు. ఒకవేళ వాళ్లలో ఎవరైనా అద్దె చెల్లించలేకపోతే.. వారి అద్దెను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ యజమానులు కార్మికులకు ఆహార సదుపాయం కల్పించాలని కోరారు.
Doctors are on the frontlines of the battle against Coronavirus. All doctors serving in Delhi government’s Lok Nayak Hospital and GB Pant Hospital on COVID-19 duty will now be housed in Hotel Lalit.#DelhiFightsCorona
— CMO Delhi (@CMODelhi) March 30, 2020