కుట్లు పడ్డాయి : తప్పతాగి పోలీసును కరిచిన మహిళ

కుట్లు పడ్డాయి : తప్పతాగి పోలీసును కరిచిన మహిళ

Updated On : March 8, 2019 / 2:12 PM IST

పాపం పోన్లే అని కాపాడేందుకు వచ్చిన పోలీసులనే కరిచింది ఆ మహిళ. రోడ్డు మీద పడి ఉన్న మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రదేశానికి వచ్చిన మహిళా పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా సిటీలో జరిగిన ఈ సంఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది.

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సమీపంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో రాత్రి 11.30గంటలకు ఓ మహిళ రోడ్డుపై పడి ఉంది. రోడ్డుపై అటుగా పోయే వారు పోలీసులకు సమాచారం అందించారు. బీదానగర్ నార్త్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ మహిళా పోలీసుతో సహా అక్కడికి చేరుకున్నారు. ఫుట్‌పాత్ అపస్మారక స్మితిలో ఉన్న యువతిని కదిలించేందుకు ప్రయత్నించారు. 

దానికి నిరాకరించడంతో మరింత చొరవ తీసుకుని కాస్త బలంగా పైకి లేపారు. ఫుల్లుగా తాగి మత్తులో ఉన్న మహిళ కండ ఊడేంత గట్టిగా కొరికింది. మహిళ కోసం తెచ్చిన అంబులెన్స్ పోలీసుకు ఉపయోగపడింది. తాగి అంత మత్తులో ఉన్నా.. పోలీసులకు చిక్కకుండా రోడ్డుపై పడిలేస్తూ పారిపోయేందుకు ప్రయత్నించింది. 

మరికొంత మంది మహిళా అధికారులను పిలిపించి బలవంతంగా అంబులెన్స్ లో ఎక్కించి దగ్గర్లోని ఆసుపత్రికి పంపించారు. దగ్గర్లో ఉన్న బార్‌లో పలు రకాల ఆల్కహాల్ డ్రింక్ లు మొత్తం తాగేసరికి అంత మత్తులోకి వెళ్లి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. రాత్రి 1గంట సమయంలో ఆమెను తన బంధువులకు అప్పగించారు.