హర్యానా కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా…ఈయన ఎవరో తెలుసా

  • Published By: venkaiahnaidu ,Published On : October 24, 2019 / 07:39 AM IST
హర్యానా కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా…ఈయన ఎవరో తెలుసా

Updated On : October 24, 2019 / 7:39 AM IST

హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి బీజేపీనే హర్యానాలో అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కింగ్ మేకర్ గా ఏడాది క్రితం దుష్యంత్ చౌతాలా స్థాపించిన జననాయక్ జనతా పార్టీ(JJP)మారనుంది.

 జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అంచనాలకు మించి రాణించింది. బీజేపీ, కాంగ్రెస్ వంటి హేమాహేమీలను తట్టుకుని నిలబడగలిగింది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. 12 అసెంబ్లీ స్థానాల్లో లీడ్ లో ఉన్న జేజేపీ.. ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో- అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. జన్ నాయక్ జనతాపార్టీ అధినేత దుష్యంత్ చౌతాలాను మెప్పించడానికి తమ వంతు ప్రయత్నాలు ఆరంభించాయి. జేజేపీకి కాంగ్రెస్ ఇప్పటికే సీఎం సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం.

దుష్యంత్ సింగ్.. మాజీ ఉప ప్రధాన మంత్రి చౌదరి దేవీలాల్ మునిమనవడు. హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు. గతంలో దుష్యంత్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్(INLD)పార్టీలో కొనసాగారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. సొంతంగా జన్ నాయక్ జనతాపార్టీని స్థాపించారు. ఏడాది కిందటే ఆయన ఈ పార్టీని నెలకొల్పారు. తన తాత దేవీలాల్ కు ఉన్న పేరు ప్రతిష్ఠలను నిచ్చెనగా మార్చుకున్నారు. హర్యానా రాజకీయాల్లో ఓ కెరటంలా దూసుకొచ్చారు. పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఏకంగా ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చే పార్టీకే తాను మద్దతు ఇస్తామని దుష్యంత్ చౌతాలా తేల్చి చెప్పారు.