బిగ్ ఫైట్‌.. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పూర్తి వివరాలు

Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. షెడ్యూల్ వస్తే దేశవ్యాప్తంగా పొలిటికల్ సినారియో మరింత మారే అవకాశం..

బిగ్ ఫైట్‌.. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పూర్తి వివరాలు

Lok Sabha Elections 2024

బిగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నాయి. వరుస పెట్టి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాయి పార్టీలు. నామినేషన్ల తేదీలు, పోలింగ్ డేట్స్‌పై క్లారిటీ రావడమే ఆలస్యం.

కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే.. ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు రెడీగా ఉన్నాయి రాజకీయ పార్టీలు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై కసరత్తును అన్ని పార్టీలు కొలిక్కి తెస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది సీఈసీ.

4 రాష్ట్రాల అసెంబ్లీలకు..

లోక్‌సభతో పాటుగానే.. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16తో గడువు ముగియనుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్‌ 24వ తేదీతో ముగియనున్నాయి.

లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జూన్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది.

గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌ నుంచి మే నెలల్లోనే.. ఏడు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది సీఈసీ. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

కమిషనర్ల పోస్టులు భర్తీ..

సరిగ్గా ఎన్నికలకు ముందే కేంద్ర ఎన్నికల సంఘంలో.. రెండు కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో షెడ్యూల్ ఆలస్యం అవుతుందని భావించారు. ఆఘమేఘాల మీద నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ప్రధాని నేతృత్వంలోని హైపవర్డ్‌ కమిటీ సమావేశమై.. ఈసీ సభ్యులను ఎంపిక చేసింది. కొత్త కమిషనర్లు బాధ్యతలు కూడా తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. షెడ్యూల్ వస్తే దేశవ్యాప్తంగా పొలిటికల్ సినారియో మరింత మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ జాబితాలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. 370 సీట్ల టార్గెట్‌తో ఈసారి ఎన్నికలను ఫేస్ చేసేందుకు రెడీ అయింది బీజేపీ. ఇండియా కూటమిగా అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది కాంగ్రెస్.

ఎన్నికల హామీలను కూడా ప్రకటించేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సుస్తిర, అవినీతి రహిత పాలన పేరుతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ స్కెచ్‌లు వేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ రోజుకు మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరోఎత్తు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఓవైపు పొత్తులు.. మరోవైపు సీట్ల పంచాయతీ, ఇంకోవైపు అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య విమర్శలతో కాక రేపుతోంది ఏపీ రాజకీయం.

ఆంధ్రప్రదేశ్‌లో..
వైనాట్ 175 అని వైసీపీ అంటుంటే.. ఎలాగైనా జగన్‌ను దించి తీరుతామంటోంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. సీట్ల పంపకాలపై క్లారిటీకి వచ్చిన పార్టీలు.. ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. సీఎం జగన్ ఇప్పటికే నాలుగు సిద్ధం సభలను నిర్వహించి.. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాలను చుట్టేసేలా షెడ్యూల్ తయారు చేసుకుంటున్నారు. త్వరలోనే అభ్యర్థుల తుది జాబితా.. మేనిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం జగన్.

తెలంగాణలో..
ఇటు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని..ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు చేరికలపై దృష్టిపెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి వలసలు తలనొప్పిగా మారాయి.

బీఎస్పీకి రెండుసీట్లు కేటాయించిన గులాబీ బాస్.. మిగిలిన 15 సీట్లలో అభ్యర్థుల ఖరారును కొలిక్కి తెస్తున్నారు. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రధానిమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఓ రౌండ్ తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు రెడీ అవుతున్నాయి.

PM Modi Road Show : మల్కాజిగిరిలో ప్రధాని రోడ్​షో.. ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన మోదీ!