కన్నీళ్లు పెట్టుకున్న దేవెగౌడ…హాసన్ నుంచి బరిలోకి మనవడు

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 03:20 PM IST
కన్నీళ్లు పెట్టుకున్న దేవెగౌడ…హాసన్ నుంచి బరిలోకి మనవడు

ఇప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ లోక్ సభ స్థానాన్ని ఇకపై మనవడు చూసుకుంటారన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. అందరూ అనుకుంటున్నట్లుగానే కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తాడని దేవగౌడ ప్రకటించారు. బుధవారం(మార్చి-13,2019) హాసన్ జిల్లాలోని హోలెనర్సీపురా తాలూకాలోని ముదలహిప్పే గ్రామంలో జరిగిన పబ్లిక్ క్యాంపెయిన్ పాల్గొన్న దేవెగౌడ…హాసన్ నుంచి తాను ఈ సారి లోక్ సభకు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హాసన్ నుంచి జేడీఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తారని ప్రకటించారు. ;ప్రజ్వల్ కు అండగా నిలస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్ డీ రేవణ్ణ ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్నారు. 
ఈ ఎన్నికల్లో ప్రజ్వల్ గెలవాలని ఆశీర్వదిస్తున్నా అని అంటున్నప్పుడు గౌడ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న ప్రజ్వల్ ఆయన కన్నీటిని తుడిచాడు. అనంతరం గౌడ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘నేను ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చాను. వారికి మద్దతు తెలిపాను. కానీ నా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకువస్తానంటే ఎందుకు తప్పులు వెతుకుతున్నారో తెలీదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు దశాబ్దాలుగా హాసన్ ను కంచుకోటగా మార్చుకున్న దేవెగౌడ ఈ సారి తన మనువడిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించడంతో బెంగళూరు నార్త్ లేదా మైసూర్-కొడగు నియోజకవర్గాల నుంచి దేవెగౌడ బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.