40వేల కోట్లు కోసమే “మహా డ్రామా”…ప్రకంపనలు సృష్టిస్తోన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2019 / 03:22 PM IST
40వేల కోట్లు కోసమే “మహా డ్రామా”…ప్రకంపనలు సృష్టిస్తోన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

Updated On : December 2, 2019 / 3:22 PM IST

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయినప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ నవంబర్ 23న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మూడు రోజుల్లోనే సీఎం పదవికి ఫడణవీస్ రాజీనామా చేశారు. అంత హడావుడిగా ఫడణవీస్ ప్రమాణం చేయడం వెనుకున్న ఆంతర్యాన్ని అనంత్ కుమార్ బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40వేల కోట్లను కాపాడేందుకే మహా డ్రామా ఆడినట్లు అనంత్‌కుమార్ తెలిపారు.

ఆదివారం(నవంబర్-1,2019) కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో  హెగ్డే మాట్లాడుతూ…మీ అందరికీ తెలుసు. మహారాష్ట్రలో మా పార్టీ నేత కేవలం 80 గంటల పాటు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. ఈ డ్రామా ఎందుకు ఆడాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజార్టీ లేదని తెలిసినప్పటికీ అతడు సీఎం ఎందుకు అయ్యాడు? అని అందరూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. 

సుమారు రూ.40వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా ఫడ్నవీస్ కాపాడారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కోసం ఆ నిధులను ఉపయోగించరు. అవన్నీ పక్కదారి పడతాయి. ఇదంతా ముందే ప్లాన్ చేశాం. సీఎంగా ప్రమాణం చేసిన 15 గంటల్లోపే ఫడ్నవీస్ ఆ నిధులను కేంద్రానికి తిప్పి పంపారు. పెద్ద డ్రామా నడపాలని ముందే భావించాం. అందుకే ప్రమాణస్వీకారం చేసి రాజీనామా చేయించాం. ఆ నిధులు ఇక్కడే ఉంటే తర్వాత వచ్చే సీఎం ఏం చేస్తారో మీకు తెలుసు కదా అని అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మహా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అనంతకుమార్‌ హెగ్డే చేసిన సంచలన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఫడ్నవీస్‌ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని.. ’80 గంటలు ముఖ్యమంత్రిగా ఉండి.. మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించారని అనంతకుమార్‌ హెగ్డే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయడం అనేది మహారాష్ట్రకు ద్రోహం  చేయడమే అవుతుందని సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌ చేశారు.