“యుద్ధం” ముగిసింది.. భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ.. అధికారిక ప్రకటన
కాల్పుల విరమణను భారత్ అధికారికంగా ప్రకటించింది.

కాల్పుల విరమణను భారత్ అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు భారత డీజీఎంవోకి ఫోన్ చేసిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
సాయంత్రం 5 గంటల నుంచి భూమిపై, గగనతలంలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని వారితో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇవాళ రెండు వైపులా సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మళ్లీ చర్చలు జరుపుతుందని ప్రకటించారు.
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. యుద్ధ సమయంలో ఇరు దేశాలు విజ్ఞత పాటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత తక్షణ, సంపూర్ణ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పారు. ట్రంప్ ఈ ట్వీట్ చేసిన కొన్ని సేపటికే భారత్ కూడా కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.
పహల్గాంలో గత నెల 22న ఉగ్రవాదులు టూరిస్టులను మతం పేరు అడిగి మరీ కాల్చిచంపడంతో పాకిస్థాన్ భూభాగంపై భారత్ దాడులు జరిపింది. దీంతో పాకిస్థాన్ కూడా భారత భూభాగాలపై దాడులు యత్నించింది. భారత్ దీటుగా సమాధానం చెప్పింది.
పాకిస్థాన్ ప్రకటన
పాకిస్థాన్, ఇండియా కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. తమ దేశం ఎల్లప్పుడూ శాంతి, భద్రతలనే కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై రాజీపడకుండానే శాంతి, భద్రతలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఉగ్ర చర్యలకు పాల్పడితే యుద్ధ చర్యకు పాల్పడ్డట్టే
పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్‌పై యుద్ధ చర్యకు పాల్పడ్డట్టుగానే పరిగణించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తారు. అందుకు తగ్గట్టుగానే భారత్ ప్రతిస్పందన ఉంటుంది.