గల్వాన్ ఘర్షణలో సైనికుల మృతిపై…తొలిసారి నోరువిప్పిన చైనా

కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరవీరులయ్యారు. దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగానికి యావత్ దేశం సెల్యూట్ చేసింది.
అయితే, గల్వాన్ ఘటనలో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు కూడా మరణించినట్లు అప్పట్లో అంతర్జాతీయ కథనాలు వచ్చాయి. 30 నుంచి 40 మంది చైనా జవాన్లు చనిపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. కానీ చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై ఎక్కడా బయటపెట్టలేదు. చివరకు వారి అంత్యక్రియలను కూడా రహస్యంగా చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదనే విమర్శలను డ్రాగన్ ఎదుర్కొంది.
కాగా, ఎట్టకేలకు గల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికులపై చైనా మౌనం వీడింది .గల్వాన్ ఘర్షణల్లో ఐదుగురు సైనికులు చనిపోయారని చైనా ప్రకటించింది. ఈ వారం భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న మోల్డోలో మిలటరీ స్థాయి దౌత్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తమ సైనికుల మృతి గురించి ప్రస్తావించింది చైనా. గల్వాన్ ఘర్షణల్లో ఐదుగురు సైనికులు చనిపోయారని.. వారిలో చైనీస్ కమాండింగ్ అధికారి కూడా ఉన్నాడని చెప్పినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. .
మరోవైపు, చైనా చెప్పిన దాని కంటే ఎక్కువ మంది సైనికులు మరణించారని భారత అధికారులు తెలిపారు.. చైనా ఐదుగురు జవాన్లు మరణించారని చెబుతోందని…కానీ 15 మంది చైనా జవాన్లు మరణించారని వెల్లడించారు.