ఢిల్లీలో పేలిన గ్యాస్ సిలిండర్స్ : 250 గుడిసెలు బూడిద

ఢిల్లీ: ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మెట్రో ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం మరచిపోకముందే అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం (ఫిబ్రవరి 12) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 17మంది మృతి చెందారు. ఈ క్రమంలో 24 గంటలు గడవకముందే మరోసారి ఇటువంటి ఘటన జరిగింది. బుధవారం (ఫిబ్రవరి 13) తెల్లవారు ఝామున పశ్చిమపురి ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 250కి పైగా గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. 26 ఫైర్‌ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంగళవారం అర్ధరాత్రి ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతం అంతా పొగమయంగా మారిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళ దుర్ఘటన జరగడంతో గుడిసెల్లో నివసిస్తున్న వారంతా చలికి తట్టుకోలేక తెల్లవార్లు వణికిపోయామని బాధితులు వాపోతున్నారు. ఈ ప్రమాదంలో తాము సర్వస్వరం పోగొట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.